కత్తిదూసిన ప్రేమోన్మాదం

ABN , First Publish Date - 2021-01-20T08:32:05+05:30 IST

ఓ ప్రేమోన్మాది విచక్షణా రహితంగా చేసిన కత్తి దాడిలో యువతి బలైపోయింది. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణంపై పోలీసుల కథనం..

కత్తిదూసిన ప్రేమోన్మాదం

గొంతు కోసి... 19 సార్లు పొడిచి... 

అడవిలోకి పారిపోయిన ప్రియుడు 

చిత్తూరులో యువతి దారుణ హత్య 

నిందితుడి ఇల్లు, వాహనానికి నిప్పు 

తండ్రిని చితకబాదిన గ్రామస్థులు 


పెనుమూరు, జనవరి 19: ఓ ప్రేమోన్మాది విచక్షణా రహితంగా చేసిన కత్తి దాడిలో యువతి బలైపోయింది. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణంపై పోలీసుల కథనం.. పెనుమూరు మండలం తూరుప్పల్లెకు చెందిన గాయత్రి(20), పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన డిల్లీబాబు(20) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులను కాదని గతేడా ది డిసెంబరు 11న తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువ తి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇళ్లకు పంపించేశారు. తల్లిదండ్రులు యువతిని తమ ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తపడటంతో యువకుడు రగిలిపోయాడు. తల్లిదండ్రుల మాట విని తనకు దూరమైపోతుందని భావించాడు. తనకు దక్కని యువతి మరెవరికీ దక్కకూడదని నిర్ణయానికొచ్చాడు. మంగళవారం గాయత్రి పక్కింటి యువతులు రమ్య, లోహితతో కలిసి స్కూటీపై సొంత పనుల కోసం 5కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుమూరుకు వెళ్లారు.


అక్కడినుంచి తిరిగివస్తుండగా రాజాయిండ్లు సమీపంలో మాటేసిన డిల్లీబాబు.. మాట్లాడాలి రమ్మంటూ గాయత్రిని పిలవగా ఆమె రానని చెప్పడంతో కోపంతో ఊగిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు.  19 సార్లు పొడిచాడు. తర్వాత తన ద్విచక్రవాహనంపై పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి కొంతదూరం వెళ్లి అక్కడ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన గాయత్రి చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. నిందితుడు పరారవడంతో డిల్లీ బాబు ఇంటిపై గ్రామస్థులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అతని తండ్రి సుబ్బయ్యను చితకబాదారు. డీఎస్పీ సుధాకరరెడ్డి, సీఐ ఆశీర్వాదం చింతమాకులపల్లె, తూరుప్పల్లెల్లో పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-01-20T08:32:05+05:30 IST