ఆలయ మంత్రి సొంత మంత్రం

ABN , First Publish Date - 2021-02-01T09:53:20+05:30 IST

విజయవాడ ఇంద్రకీలాద్రి చెంతనే విజయేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబీకుల చేతిలో ఉంది.

ఆలయ మంత్రి సొంత మంత్రం

  • కుటుంబ గుడికి 1.30 కోట్ల సీజీఎఫ్‌ నిధులు
  • జీర్ణావస్థలోనిఆలయాలకు వాడే నిధులివి
  • గరిష్ఠంగా 40లక్షలకు మించి వాడకూడదు
  • వాటితో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడుతున్న వైనం
  • పురావస్తు స్థలాన్ని ఆక్రమించి మరీ నిర్మాణం


ఆయన దేవాలయాల మంత్రి. రాష్ట్రంలోని ఆలయాల ఆలనాపాలన ఆయన శాఖ బాధ్యత. కానీ, దానిని ఆయన ‘సొంత శాఖ’లా చూసుకొంటున్నారు.ఆలయాల మరమ్మతులకు వాడాల్సిన నిధులను సొంత ఆలయానికి మళ్లించి, అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడుతున్నారు. పురావస్తు శాఖ భూముల్లో ఈ కాంప్లెక్స్‌ను పైకి లేపుతున్నారు. దీన్నంతా దేవాలయ అభివృద్ధి ఖాతాలో వేసేయడం కొసమెరుపు!


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి చెంతనే విజయేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబీకుల చేతిలో ఉంది. దేవదాయశాఖలో రిజిస్టర్డ్‌ ఆలయంగా ఉన్న ఈ ఆలయానికి ఈవో ఉండరు. ప్రైవేటు ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. మంత్రి తండ్రి వెలంపల్లి సూర్యనారాయణ కొన్నేళ్లుగా ట్రస్టు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతమంతా ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిధిలోకి వస్తుంది. వెలంపల్లి ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న పురావస్తు శాఖ స్థలంపై మంత్రి కన్నుపడింది. దుర్గగుడి చెంతనే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో షాపులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో స్థలాన్ని ఆలయం పేరుతో తమ ఆధీనంలోకి తెచ్చుకుని అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంచేపట్టాలని నిర్ణయించారు. దీనికి దేవదాయశాఖ నుంచి నిధులు పొందేలా స్కెచ్‌ వేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో దేవదాయశాఖ సర్వశ్రేయోనిధి (కామన్‌ గుడ్‌ ఫండ్‌- సీజీఎఫ్‌) నిధుల్లోంచి రూ.1.30కోట్లు కేటాయింప చేసుకున్నారు. నిజానికి ఈ నిధులను జీర్ణావస్థలో ఉన్న ఆలయాల మరమ్మతులకు వాడాలి.


దీంతో మంత్రి అతిక్రమణల బాగోతం బయటపడింది. సాధారణంగా సీజీఎఫ్‌ నుంచి గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు కేటాయిస్తుంటారు. కానీ మంత్రి సొంత ఆలయం కావడంతో చేయి కాస్త పెద్దదైంది. ఈ నిధులను జీర్ణావస్థలో ఉన్న ఆలయ మరమ్మతులకూ, ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతుల కల్పనకూ ఉపయోగించాలి. కానీ, ఈ పనులేవీ చేయకుండా కేవలం 10 దుకాణాలతో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కాంప్లెక్స్‌ చేపట్టిన స్థలం పురావస్తు శాఖ పరిధిలో ఉండటంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనలు అమలవుతున్నాయి.


అక్కన్న-మాదన్న గుహలకు ముప్పు

విజయేశ్వరస్వామి ఆలయం చెంతనే అక్కన్న-మాదన్న గుహలు ఉన్నాయి. ఇవి పురావస్తు కట్టడాలు. గతంలో దుర్గగుడి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో పెర్గొలాల నిర్మాణం చేపట్టింది. దీంతో మాదన్న గుహలకు ముప్పుందని, ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పురావస్తు శాఖ నోటీసులు ఇచ్చి వాటిని నిలిపివేసింది. దీంతో పెర్గొలాలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. అయినా మంత్రి కుటుంబీకులు అక్కన్న మాదన్న గుహల సమీపంలో ఉన్న విజయేశ్వరస్వామి ఆలయం వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టారు. దీనిపై  ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కన్సరేటివ్‌ ఆఫీసర్‌ యశ్వంత్‌... విజేయశ్వరస్వామి ఆలయానికి నోటీసులు ఇచ్చారు. తక్షణం నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించారు. కానీ మంత్రి అండతో ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. మంత్రి కుటుంబీకుల శైలిపై భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


విజయ ఆలయం

విజయేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడని, అర్జునుడి తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు పాశుపతాస్త్రం ప్రసాదించారని ప్రతీతి. పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసి విజయం సాధించడంతో ఇంద్రకీలాద్రి చెంతనే ఉన్న ఈ పర్వతం మీద ఈశ్వరుణ్జి విజయేశ్వరునిగా ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. నాటి నుంచి అర్జునుడిని విజయుడని, ఈ నగరానికి విజయవాటిక అని పేరు వచ్చిందని చెబుతారు.

Updated Date - 2021-02-01T09:53:20+05:30 IST