పాలకుల బాధ్యతారాహిత్యంతోనే పన్నుభారం

ABN , First Publish Date - 2021-06-22T09:07:47+05:30 IST

కరోనా కష్టకాలంలో పన్నుల భారం మోపడం ప్రభుత్వం, పాలకుల బాధ్యతారాహిత్యమేనని పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు అన్నారు

పాలకుల బాధ్యతారాహిత్యంతోనే పన్నుభారం

పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ బాబూరావు.. బీఆర్టీయస్‌ రోడ్డుపై వినూత్న నిరసన 


విజయవాడ (సత్యనారాయణపురం), జూన్‌ 21: కరోనా కష్టకాలంలో పన్నుల భారం మోపడం ప్రభుత్వం, పాలకుల బాధ్యతారాహిత్యమేనని పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు అన్నారు. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై ఆస్తి, చెత్త పన్నుల భారం వద్దని నినాదాలు రాసి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ,ఒక వైపు కరోనా దెబ్బ, మరోవైపు పన్నుల పెంపుతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయక పోతే ప్రతిఘటన తప్పదన్నారు. ఆస్తి విలువ ఆథారిత ఇంటి పన్ను విధానంతో పట్టణ ప్రజలను శాశ్వతంగా పన్నుల ఊబిలోకి ప్రభుత్వం దించుతోందని ఆరోపించారు. మున్సిపాలిటీలు పౌర సేవలకు రేటు కట్టి చెత్తతో సహా అన్నిటిపై పన్నులు వసూలు చేయడం దారుణమన్నారు. మద్యం, ఇసుకపై వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు చెత్తపైనా వ్యాపారం చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి ప్రజలపైన పన్నుల రూపంలో ముప్పేట దాడి చేయడం దారుణన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ మంచిదే.. కానీ ఆ సాకుతో ప్రజలపైన పన్ను భారం మోపడం హానికరమన్నారు. ఆస్తి విలువ ఆథారిత పన్ను విధానాన్ని కట్టిపెట్టాలని, చెత్త పన్ను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో మున్సిపల్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-06-22T09:07:47+05:30 IST