ఆశాలకు నిరాశ!

ABN , First Publish Date - 2021-08-29T09:10:58+05:30 IST

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వివిధ రూపాల్లో సేవలు అందించే ఆశా వర్కర్లకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రిటైర్మెంట్‌’ విధానం ప్రాణసంకటంగా పరిణమించింది. అదేసమయంలో వీరిని..

ఆశాలకు నిరాశ!

రిటైర్మెంట్‌ పేరుతో తొలగింపు

గత ప్రభుత్వం రిటైర్మెంట్‌ వద్దంది 

జగన్‌ సర్కారుకు అదే ముద్దయింది

ఇప్పటికే 3 వేల మంది ఆశాల తొలగింపు

ప్రభుత్వ పథకాలు కూడా వర్తించని వైనం

కుటుంబ సభ్యులకు పెన్షన్‌.. ‘చేయూత’ కట్‌

పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతల వత్తిళ్లు

ఉన్నవారిని తొలగించి.. తమ వారికి అవకాశం

ప్రభుత్వంపై కదంతొక్కేందుకు వర్కర్లు సిద్ధం


రాష్ట్రంలోని ఆశా వర్కర్ల పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారింది. ఇటు ఉద్యోగం వదులుకోక.. అటు ప్రభుత్వ పథకాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

 

ఆశా వర్కర్లకు జగన్‌ ప్రభుత్వం ‘రిటైర్మెంట్‌’ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అమలు చేస్తోంది. ఇన్సెంటివ్‌ పద్ధతిలో పనిచేసే ఆశా వర్కర్లకు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్‌ విధానం అమలు చేస్తూ ఇప్పటికే మూడు వేల మందిని తొలగించింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వివిధ రూపాల్లో సేవలు అందించే ఆశా వర్కర్లకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రిటైర్మెంట్‌’ విధానం ప్రాణసంకటంగా పరిణమించింది. అదేసమయంలో వీరిని ప్రభుత్వ పథకాలకు దూరం చేయడం ఆయా కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా జగన్‌ సర్కారు 60 ఏళ్లు దాటిన ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగిస్తోంది. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.3 వేల వేతనం ఇవ్వడంతో పాటు 60 ఏళ్లు నిండిన వారు రిటైర్మెంట్‌ తీసుకోవాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. ఈ ఉత్తర్వులపై ఆశా వర్కర్లు అప్పటి ప్రభుత్వంతో చర్చించి రిటైర్మెంట్‌ అంశాన్ని పక్కన పెట్టేలా ఒత్తిడి తెచ్చారు. దీంతో గత సర్కారు ఆశా వర్కర్లు పని చేసినంత కాలం చేయించుకునేలా వెసులుబాటు కల్పించింది. పైగా అప్పట్లో ఆశాలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇన్‌సెంటివ్స్‌ను అమలు చేసింది. ఇదిలావుంటే, గత ప్రభుత్వం ఇచ్చిన రిటైర్మెంట్‌ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని.. జగన్‌ ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన ఆశా వర్కర్లను రిటైర్మెంట్‌ పేరుతో విధుల నుంచి తొలగిస్తోంది.


ఇలా ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా ఆశా వర్కర్లను తొలగించారు. వారి స్థానంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసులు ఉన్న వారినే నియమిస్తున్నారు. కొన్ని చోట్ల చాలా మంది ఆశా వర్కర్లపై రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకువచ్చి విధుల నుంచి తప్పుకొనేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాలో 60 ఏళ్లు దాటాయనే కారణం చూ పి.. ప్రస్తుతం పనిచేస్తున్న ఆశాలను తొలగించి ‘తమ వారిని’ నియమించుకుంటున్నారని   ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


‘హామీ’.. మేరకు తొలగింపు!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని జగన్‌ ప్రకటన చేశారు. ఆ హామీయే ఇప్పుడు తమ కొంప ముంచిందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.10 వేల వేతనం అందుకుంటున్నందున వీరందరినీ.. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగా ఆశాలకు సంబంధిత రూల్స్‌ను అమలు చేస్తున్నారు. ఫలితంగా ఆశాలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలూ వర్తించడం లేదు. అంతేకాదు.. ఆశా కుటుంబా ల్లో అర్హులైన వారికి కూడా సామాజిక ఫింఛన్లను ఇవ్వ డం లేదు. అదేవిధంగా 45 ఏళ్లు నిండిన మహిళలకు వర్తింపజేస్తున్న ‘చేయూత’ నుంచి కూడా వీరిని తొలగించారు.  కేవలం రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులతోనే సరిపెట్టారు. దాదాపు 42 వేల మంది ఆశాలపై ఈ ప్రభా వం పడడంతో వారంతా లబోదిబోమంటున్నారు. 




రాష్ట్రవ్యాప్త ఉద్యమం!

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే జిల్లాల్లో నిరసనలు ప్రారంభించారు. సెప్టెంబరు నుంచి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. తమకు రిటైర్మెంట్‌తో సంబంధం లేకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని, తమ పరిధిలోకి రాని విధులను అప్పగించవద్దని కోరుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు.. సెప్టెంబరు 7న పీహెచ్‌సీల వద్ద ఆందోళన చేయడంతోపాటు 13న కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళనలను తీవ్రతరం చేయనున్నట్టు ఆశా వర్కర్ల అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి. 

Updated Date - 2021-08-29T09:10:58+05:30 IST