సీహెచ్‌సీలదీ అదే దారి!

ABN , First Publish Date - 2021-07-08T08:51:58+05:30 IST

రైతులకు గత ప్రభుత్వాలు నేరుగా ఇచ్చిన రాయితీ యంత్రాలకు స్వప్తి పలికిన వైసీపీ ప్రభుత్వం... అద్దె యంత్రాల కేంద్రాల (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు)ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోతోంది

సీహెచ్‌సీలదీ అదే దారి!

నిబంధనాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు 

40శాతం రాయితీ అని చెప్పిన ప్రభుత్వం

సగం సొమ్ము వసూలు చేస్తున్న అధికారులు 

ముందే కట్టాలన్న షరతుతో రైతులు గుర్రు 

ట్రాక్టర్లు లేకుండా పనిముట్లు ఎందుకని ప్రశ్న

రైతు రథం పథకంలో అవినీతి సాకుతో...దాదాపు రూ.145కోట్ల బిల్లులు పెండింగ్‌ 

యంత్రాల సరఫరాకు డీలర్ల విముఖత 

10,778 ఆర్బీకేలకు 645 కేంద్రాలే ఏర్పాటు 

నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌ 


రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయడానికి ప్రారంభించిన ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ పథకం ఆశయం నెరవేరేలా కనిపించడం లేదు. ఈ పథకం అమలుకు అధికారులు విధించిన నిబంధనలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తయారీ సంస్థలు, డీలర్లు ముందుకు రాకపోవడంతో మొత్తం 10,778 ఆర్బీకేలకు గాను 645 అద్దె యంత్రాల కేంద్రాలు(సీహెచ్‌సీ) మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఇవి ఏ మేరకు అద్దె పరికరాలు అందిస్తాయన్నది ప్రశ్నార్థకమేనని రైతు సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైతులకు గత ప్రభుత్వాలు నేరుగా ఇచ్చిన రాయితీ యంత్రాలకు స్వప్తి పలికిన వైసీపీ ప్రభుత్వం... అద్దె యంత్రాల కేంద్రాల (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు)ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోతోంది.  ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని ఏడాది క్రితమే నిర్ణయించినా, ఇప్పుడు దశలవారీగా ఏర్పాటు చేస్తామంటోంది. రాష్ట్రం లో 10,778 ఆర్బీకేలు ఉండగా, 10,246 సీహెచ్‌సీ లు ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల బడ్జెట్‌ సమావేశంలో మంత్రులు ప్రకటించారు. కానీ తొలిదశలో 645 సీహెచ్‌సీలను ఈ నెల 8న సీఎం ప్రారంభించనున్నారు. 


సగం సొమ్ము చెల్లిస్తేనే... 

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం పేరిట వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేస్తామన్న అధికారులు విధించిన నిబంధనలు రైతులకు ఏమాత్రం రుచించడం లేదు. యంత్రం విలువలో సగం ధర ముందుగా చెల్లించాలన్న నిబంధనపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లను రాయితీపై ఇవ్వాలని అనేకమంది రైతులు కోరుతున్నారు. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రథం’ పథకాన్ని రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం ట్రాక్టర్ల కొనుగోలుపై ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. కానీ ట్రాక్టర్లు లేకుండా గొర్రులు ఏం చేసుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో 4వేల దాకా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఉంటేనే రైతులకు సకాలంలో వ్యవసాయ పనిముట్లు లభ్యమయ్యేవి కావు. ఇప్పుడు కౌలు రైతులే ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నందున కూలీల కొరత, డిమాండ్‌ను అధిగమించాలంటే, యంత్ర పరికరాల అవసరం ఎంతో ఉందని రైతులు పేర్కొంటున్నారు. 


ముందుకురాని  రైతులు 

ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి సీహెచ్‌సీ పరిధిలో ఐదారుగురు రైతుల్ని ఎంపిక చేసి, రైతు గ్రూపుగా ఏర్పాటుచేశారు. అందులో ఇద్దరితో జాయింట్‌ అకౌంట్లు తెరిపించారు. ఒక్కో కేంద్రానికి రూ.15లక్షల విలువైన యంత్రాలివ్వాలని నిర్ణయించారు. యంత్రం విలువలో 40ు రాయితీగా ప్రకటించారు. 50ు ఆప్కాబ్‌ రుణం, 10ు రైతుబృందం వాటాగా చెల్లించాలని నిబంధన పెట్టారు. ఈ రుణంపై 3 శాతం వడ్డీని అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ నుంచి కేంద్రం ఇస్తుంది. కానీ పలు జిల్లాల నుంచి అందించిన సమాచారం మేరకు యంత్రం విలువలో 50ు రైతు గ్రూపు ముందుగా చెల్లిస్తే, తర్వాత రాయితీ సొమ్మును ఖాతాలో వేస్తామని అధికారులు నచ్చజెప్పి, సీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. 


అసలు కథ ఇదీ! 

ఈ ప్రభుత్వానికి పరికరాలను సరఫరా చేయడానికి యంత్రాల తయారీ సంస్థలు, అనేకమంది డీలర్లు విముఖత చూపడంతో అధికారులు పూర్తిస్థాయిలో సీహెచ్‌సీలను ఏర్పాటు చేయలేకపోయారని సమాచారం. 2017-18, 2018-19లో రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు, కేంద్రం వాటాతో అమలుచేసే వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి పరికరాలు సరఫరా చేసిన అనేకమంది డీలర్లకు జగన్‌ సర్కారు రూ.145కోట్లు దాకా పెండింగ్‌ పెట్టింది. ఈ సొమ్ము గురించి అడిగితే.. సీహెచ్‌సీలకు మళ్లీ యంత్ర పరికరాలు సరఫరా చేయాలంటూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హుకుం జారీ చేయడం తప్ప, పెండింగ్‌ బిల్లుల ఊసెత్తడం లేదని డీలర్లు వాపోతున్నారు. రైతురథం పథకంలో అవినీతి సాకుతో పాత బకాయిలు ఇవ్వకపోవడంతో కొందరు డీలర్లు గుర్రుగా ఉన్నారు. కొత్తగా పరికరాలు సరఫరా చేయడానికి తమవద్ద పెట్టుబడులు లేవని చాలామంది చేతులెత్తేశారు. ఇదిలాఉండగా, రైతు రథాన్ని రద్దుచేసిన ప్రభుత్వం ఆ పథకంలో అవినీతిని మాత్రం బయటపెట్టలేకపోవడం విశేషం.

Updated Date - 2021-07-08T08:51:58+05:30 IST