అంబేడ్కర్‌తో హక్కులు రాలేదు

ABN , First Publish Date - 2021-12-31T07:20:41+05:30 IST

అంబేడ్కర్‌తో హక్కులు రాలేదు

అంబేడ్కర్‌తో హక్కులు రాలేదు

అది జగ్జీవన్‌రామ్‌ ఘనత: ఎమ్మెల్యే శ్రీదేవి

మండిపడుతున్న దళిత సంఘాలు

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌


గుంటూరు, విజయవాడ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో అమరావతి రాజధాని రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని తూలనాడారు. గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ నిలువెత్తు విగ్రహం చూసి ఇది అంబేడ్కర్‌దేనా? అని ప్రశ్నించారు. అలానే, ‘రెడ్లతోనే రాష్ట్రానికి నష్టం. నువ్వు పోస్టింగ్‌ కోసం నా కాళ్లు పట్టుకొన్నావు’ అని ఒక సీఐపై మండిపడ్డారు. తాజాగా ఆమె గురువారం రాజమహేంద్రవరంలో జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో ఏకంగా దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పైనే నోరు జారారు. ‘‘బాబూ జగ్జీవన్‌రామ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంబేడ్కర్‌ ద్వారా హక్కులు వచ్చాయా? రాలేదు. రాజ్యాంగ హక్కులను జగ్జీవన్‌రామ్‌ మనకు అమలు చేశారు. ఈ రోజున రాజకీయంగా, సామాజికంగా మనం ఎదుగుతున్నామంటే అది జగ్జీవన్‌రామ్‌ ఘనతే. నేను ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని అన్నారు. అంబేడ్కర్‌ ద్వారా మనకు హక్కులు రాలేదంటూ ఆమె మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ‘‘దళిత బహుజనుల ఆరాధ్య దైవం అంబేడ్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి యావత్‌ దళిత బహుజన జాతులకు క్షమాపణ చెప్పాలి. ఇంతకుముందు కూడా అంబేడ్కర్‌ ఎవరో తెలియనట్లు మాట్లాడారు. ఆయన కల్పించిన రిజర్వేషన్‌తోనే ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారనే విషయం మరిచిపోకూడదు. అంబేడ్కర్‌ను తక్కువ చేసి మాట్లాడితే ఖబడ్దార్‌’’ అంటూ పలువురు దళిత నేతలు హెచ్చరించారు. వెంటనే ఆమెని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


అజ్ఞానంతోనే వ్యాఖ్యలు...

‘‘అజ్ఞానంతో ఎమ్మెల్యే శ్రీదేవి అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు చేశారు. జగ్జీవన్‌రామ్‌ను పొగిడేందుకు ఆయన్ను అవమానించడం ఏమిటి? ఆమెకు చదువు, సంస్కారం ఉన్నాయా? దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి హక్కుల కోసం అంబేడ్కర్‌ కృషి చేశారు’’ అని అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు.


శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అంబేడ్కర్‌ను కించపరచడం దారుణమని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. ‘‘మొట్టమొదటి నుంచి వైసీపీ నాయకులు డాక్టర్‌ అంబేడ్కర్‌ అంటే అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. పలు దఫాలుగా ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆయన్ను కించపరచడం మనం చూశాం. ఇప్పుడు సాక్షాత్తు... ఎమ్మెల్యే శ్రీదేవి అంబేడ్కర్‌ను కించపరచడం దారుణం, శిక్షార్హం. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-31T07:20:41+05:30 IST