వృద్ధులనూ వదల్లేదు!

ABN , First Publish Date - 2021-12-25T07:48:23+05:30 IST

ఎటువంటి ఆసరా లేని వృద్ధులని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.

వృద్ధులనూ వదల్లేదు!

  • విశాఖలో రూ.300 కోట్ల భూమాయ
  • ఓల్డేజ్‌ హోమ్‌ కోసం ఇచ్చిన భూములవి
  • పన్నెండేళ్ల కిందట తీసుకున్న ‘హయగ్రీవ’
  • 45లక్షలు చొప్పున 12.5 ఎకరాలు కేటాయింపు
  • అప్పట్లో కార్యరూపం దాల్చని ప్రాజెక్టు
  • ఇప్పుడు అక్కడ గజం స్థలం రూ. లక్ష
  • వైసీపీ నేతల ప్రవేశం...చేతులు మారిన భూమి
  • హోమ్‌ను నిర్మించకుండా ప్లాట్లు వేసి విక్రయం
  • వాడటంలేదని విశాఖలో ఎన్నో భూములు వెనక్కి
  • కానీ, ఓల్డేజీ దందాపై మాత్రం ప్రభుత్వం చోద్యం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎటువంటి ఆసరా లేని వృద్ధులని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అటువంటి వారిని కూడా కొందరు వ్యాపార అవసరాలకు వాడేసుకుంటున్నారు. అనాథ వృద్ధులను ఆదుకుంటామని ప్రభుత్వం నుంచి భూమి తీసుకొని.. ఒక్కరికి కూడా ఆసరా కల్పించకుండా ఇప్పుడు ఆ భూమిని వాటాలు వేసుకొని మరీ అమ్మేసుకుంటున్నారు. ఇదంతా వైసీపీ పెద్దల కనుసన్నల్లో, వారి ఆధ్వర్యంలోనే జరగడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన పనికి భూమిని ఉపయోగించకపోతే వెనక్కి తీసుకుంటామని హుంకరించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. దీనిపై మాత్రం నోరెత్తడం లేదు. ఈ భూ వివాదం బెదిరింపులు, పోలీస్‌ స్టేషన్లలో కేసుల వరకు వెళ్లినా...సీఎం జగన్‌ దృష్టికి వెళ్లినా ఎటువంటి విచారణా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


12 ఏళ్ల క్రితం బీజం...

వృద్ధులతో వ్యాపారం చేయవచ్చుననే ఆలోచన విశాఖలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పన్నెండేళ్ల క్రితమే తట్టింది. తమకు భూమి కేటాయిస్తే, అందులో పది శాతం భూమిలో ఓల్డేజ్‌ హోమ్‌కు కాటేజీలు నిర్మించి, వారికి అవసరమైనవన్నీ ఉచితంగా సమకూరుస్తామని, మిగిలిన భూమిని కూడా వృద్ధులకే విక్రయిస్తామని హయగ్రీవా ఫార్మ్‌ అండ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని సంప్రదించింది. వారి ప్రతిపాదన బాగుందని సాగరతీరాన ఎండాడ సర్వే నంబరు 92/3లో 12.5 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దానికి ఎకరానికి రూ.45 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. మొత్తం భూమిలో 40 శాతం రహదారులు, సామాజిక అవసరాలకుపోగా మిగిలిన 60 శాతం భూమి అంటే సుమారుగా 36,300 గజాలు వృద్ధులకు విక్రయిస్తామని, వారి అభిరుచి మేరకు గృహాలు నిర్మిస్తామని ప్రభుత్వానికి నివేదించారు. ఇదంతా 2009 ప్రాంతంలో జరిగింది. వారికి కేటాయించిన ప్రాంతం కొండ. అందులో నుంచి వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రహదారిని ప్రతిపాదించింది. అనేక న్యాయపరమైన వివాదాలు, ఇబ్బందుల వల్ల ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. 


ఓల్డేజీ పోయి హౌసింగ్‌ వచ్చే.. 

ఇప్పుడు ఇక్కడ భూమి గజం రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది. పన్నెండున్నర ఎకరాల విలువ సుమారు మూడు వందల కోట్ల రూపాయలకు చేరింది. దాంతో పెద్దల కన్ను పడింది. భూమి ‘హయగ్రీవా’ సంస్థ అధినేత జగదీశ్వరుడి నుంచి చేజారిపోయింది. వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావులు(జీవీ) ఆ భూమిపై జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ పొందారు. అలాగే జగదీశ్వరుడికి రూ.15 కోట్ల అప్పు ఇచ్చి, దానికి ప్రతిఫలంగా ఆ భూమిలో ఐదు వేల గజాల స్థలాన్ని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ) రాయించుకున్నారు. ఆ భూమిని లేఅవుట్‌ వేయకుండానే కొండను కొండలాగే ఉంచి కాగితాలపై ప్లాట్లు చూపించి గజాల చొప్పున అమ్మేస్తున్నారు. అక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 60 ఏళ్లు దాటిన వృద్ధులకే ప్లాట్లు అమ్ముతున్నారు. అలా కొనుక్కున్న వారిలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు (వైసీపీ) కూడా ఉన్నారు. ఇప్పుడు అందులో హయగ్రీవా పేరు తప్పించేసి.. దానికి కొత్తగా ‘ఎంవీవీ-జీవీ హౌసింగ్‌’ అని పేరు పెట్టారు. ప్రభుత్వం నుంచి తక్కువ రేటుకు భూమిని తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారంటూ విశాఖపట్నంలో అనేక మంది వద్ద నుంచి భూమిని వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇక్కడ కేవలం రూ.6 కోట్లకు ఇచ్చిన భూమిపై వృద్ధుల పేరుతో వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నా, దానిపై వివాదాలు తలెత్తినా వీసమెత్తు కూడా స్పందించడం లేదు. అందుకు కారణం ఇందులో ఎంపీ, కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇంకో ఎమ్మెల్యే ఉండడమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అనుమతులిస్తే ప్రాజెక్టు పూర్తి 

‘‘ఎండాడలో భూమిని ఆనాటి మార్కెట్‌ రేటుకే ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. మాకు రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. దాంతో మాకు పూర్తి హక్కులు వచ్చాయి. నిర్మాణానికి అనుమతులు వచ్చిన నాటి నుంచి మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలనేది నిబంధన. ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే కోర్టు ద్వారా గెలుచుకున్నాం. ప్రస్తుతం ప్లాన్‌ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేశాం. అనుమతులు రాగానే మూడేళ్ల కంటే ముందే ప్రాజెక్టును పూర్తిచేస్తాం’’

- సీహెచ్‌ జగదీశ్వరుడు, హయగ్రీవ సంస్థ అధినేత


ప్రాజెక్టు పేరు మార్చలేదు...

‘‘ప్రాజెక్టు పేరు ఏమీ మార్చడం లేదు. హయగ్రీవగానే కొనసాగుతుంది. రూ.15 కోట్లతో ఓల్డేజ్‌ హోమ్‌ నిర్మించనున్నాం. దానిని జీవితాంతం ఉచితంగానే నిర్వహిస్తాం. అందుకోసం కొంత మొత్తం బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, వచ్చే వడ్డీతో దానిని నిర్వహిస్తాం’’

- గన్నమని వెంకటేశ్వరరావు, జీపీఏ హోల్డర్‌

Updated Date - 2021-12-25T07:48:23+05:30 IST