మహాపాదయాత్ర విజయవంతం కావాలి

ABN , First Publish Date - 2021-11-02T07:52:30+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు.

మహాపాదయాత్ర విజయవంతం కావాలి

  • పోలీసులు దాష్టీకానికి పాల్పడే అవకాశం ఉంది
  • అప్రమత్తంగా ఉండాలి: రఘురామ.. రెండు లక్షల విరాళం

న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. పోలీసులు దాష్టీకానికి పాల్పడే అవకాశం ఉందని, పాదయాత్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుల భోజన ఖర్చు కోసం రూ.2 లక్షల విరాళాన్ని అమరావతి రైతుల జేఏసీ ఖాతాకు జమజేశారు. ఈ విషయాన్ని సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులకు తెలిపారు. రైతుల పాదయాత్రకు బ్లూ మీడియా కూడా సహకరించాలని కోరారు. తనను అరెస్టు చేసినప్పుడు తనపై పోలీసులు కాకుండా మరెవరో దాడి చేసినట్టు విజయ్‌పాల్‌ అనే పోలీసు అధికారి రిమాండ్‌ రిపోర్టులో తప్పుడు అంశాలు రాశారని, అలాంటి అధికారులు ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని రఘురామ సూచించారు. గూగుల్‌ లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం వెతికితే నాలుగు రాజధానులు ఉన్నాయని చూపిస్తోందని తెలిపారు. ఆర్థిక రాక్షస క్రీడలో గవర్నర్‌ను భాగస్వామి చేయడం   క్షమించరాని నేరమని, హత్య కన్నా ఘోరమని వ్యాఖ్యానించారు.


రుణ ఒప్పందాలకు ఆయన పేరు వాడటం నీచమని విమర్శించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వం అనేక ఒత్తిళ్లు పెట్టిందని, బెదిరించిందని ఆరోపించారు. వైఎ్‌సఆర్‌ సాఫల్య పురస్కారాలు ఇవ్వడం నైతికంగా ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ అవార్డును ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ తిరస్కరించారని గుర్తుచేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో విశాఖపట్నం షేక్‌ అయ్యిందని, విశాఖ ఉక్కును కాపాడవలసిన బాధ్యత నూటికి నూరు పాళ్లు తమ పార్టీదేనని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని, సీఎం జగన్‌ ఒక్క ఆందోళన అయినా చేశారా? అని ప్రశ్నించారు. సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై సీఎంకు ఎందుకు లేదని నిలదీశారు. తనపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటులో పక్లార్డులు ప్రదర్శించిన తమ పార్టీ ఎంపీలు విశాఖ ఉక్కు కోసం కూడా ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-02T07:52:30+05:30 IST