దేశంలోనే అతిపెద్ద ‘తెర’మరుగు

ABN , First Publish Date - 2021-12-26T07:52:43+05:30 IST

దేశంలోనే అతిపెద్ద ‘తెర’మరుగు

దేశంలోనే అతిపెద్ద ‘తెర’మరుగు

సూళ్లూరుపేటలో మూతపడిన వి-ఎపిక్‌ థియేటర్‌ 

జీవో 35 ప్రభావంతో మరిన్ని సినిమా హాళ్ల మూత

తక్కువ ధర టికెట్లు గిట్టుబాటు కావనే నిర్ణయం

తాజాగా నెల్లూరులో ఒకటి, విశాఖలో రెండు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

దేశంలోనే అతి పెద్ద స్ర్కీన్‌ కలిగిన సినిమా థియేటర్‌ మూతపడింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ప్రభావంతో రాష్ట్రంలో మూతపడుతున్న సినిమా హాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నెల్లూరులో భారీ స్ర్కీన్‌ కలిగిన వి-ఎపిక్‌ థియేటర్‌తోపాటు, విశాఖ జిల్లాలో మరో రెండు థియేటర్లు శనివారం మూతపడాయి. తెలుగు రాష్ట్రాల్లో 50 వి-సెల్యులాయిడ్‌ మల్టీప్లస్‌ థియేటర్లను ప్రముఖ సినీ నిర్మాత వంశీకృష్ణ నిర్వహిస్తున్నారు. దక్షిణ ఆసియాలోనే రెండో అతి పెద్దది, దేశంలోనే పెద్దదైన(104 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు) స్ర్కీన్‌తో 656 సీట్ల కెపాసిటీ కలిగిన వి-ఎపిక్‌ థియేటర్‌ను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం నాదేళ్లవారికండ్రిగలో ఆ సంస్థ నిర్వహిస్తోంది. 140 సీట్ల సామర్థ్యంతో మరో రెండు థియేటర్లూ ఈ భవనంలో ఉన్నాయి. రూ.40 కోట్లతో నిర్మించిన ఈ థియేటర్లను 2019 ఆగస్టు 30న హీరో రామ్‌చరణ్‌ ప్రారంభించి, సాహో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ థియేటర్‌లో రూ.200, రూ.150కు టికెట్లు విక్రయించేవారు. చిన్న థియేటర్లలో మాత్రం రూ.150, రూ.100 టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ మల్టీప్లస్‌ థియేటర్లు పంచాయతీ పరిధిలో ఉండటంతో జీవో నెం.35 ప్రకారం రూ.70, రూ.50కు టికెట్లు విక్రయించాలన్న నిబంధనలు  ఉన్నాయి. ఆ ధరలతో థియేటర్లు నిర్వహించలేమనే నిర్ణయానికి  యాజమాన్యం వచ్చింది. దీంతో శనివారం నుంచి షోలు నిలిపివేసింది. కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఏడాదిపాటు మూతపడిన ఈ థియేటర్లు ఇటీవలే పునఃప్రారంభమయ్యాయి. తాజాగా  ప్రభుత్వ నిబంధనలతో మళ్లీ మూతపడ్డాయి. ఈ థియేటర్లపై ఆధాపడి జీవిస్తున్న 50 మంది సిబ్బంది ఉపాధి కోల్పోతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  విశాఖ జిల్లా రావికమతం మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర  థియేటర్‌ను యాజమాన్యం స్వచ్ఛందంగా శనివారం మూసివేసింది. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్‌ ధరలతో థియేటర్‌ను నడపలేమనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పెద్ద సినిమాలకు కూడా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సదుపాయాలపై అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తుండడం కారణంగానే థియేటర్‌ను యాజమాన్యం మూసివేసినట్టు చెబుతున్నారు. ఇదే జిల్లా సబ్బవరంలోని ఎస్‌టీబీఎల్‌ సినిమా థియేటర్‌నూ యాజమాన్యం శనివారం మూసివేసింది. తాజా జీవోలో పేర్కొన్న ధరలకు టికెట్లు విక్రయిస్తే నష్టాలపాలవుతామనే స్వచ్ఛందంగా థియేటర్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.


నెల్లూరులో పురాతన థియేటర్‌ సీజ్‌

నెల్లూరులోని పురాతన వినాయక హాలును శనివారం సీజ్‌ చేశారు. లైసెన్సులు, ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో హాలు మూసివేయాలని తొలుత నోటీసులు అందించారు. ఆదివారం నుంచి హాలు మూతపడుతుందని ఆర్డీవో  హుస్సేన్‌సాహెబ్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-26T07:52:43+05:30 IST