సంచలన కేసులో కీలక సాక్ష్యం మిస్..!

ABN , First Publish Date - 2021-03-21T09:04:53+05:30 IST

జడ్జి రామకృష్ణ గుర్తున్నారు కదా! ఒకానొక సమయంలో హైకోర్టు జడ్జితోనే తలపడి సస్పెన్షన్‌ వేటుకు....

సంచలన కేసులో కీలక సాక్ష్యం మిస్..!

  • సెల్‌ మారో!
  • పోలీసుస్టేషన్‌లోనే జడ్జి ఫోన్‌ మాయం
  • న్యాయమూర్తులపై ఆరోపణల కేసులో
  • జస్టిస్‌ ఈశ్వరయ్యపై హైకోర్టు విచారణ
  • కొనసాగుతున్న కోర్టు కమిషన్‌ విచారణ
  • అనూహ్యంగా.. ఫోన్‌ చోరీ అయిందని
  • కోర్టుకు మదనపల్లి పోలీసుల నివేదిక
  • చోరీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని వెల్లడి
  • కుట్రకోణం ఉందంటున్న జడ్జి రామకృష్ణ
  • మంత్రి పెద్దిరెడ్డికి పోలీసులు ఇచ్చారని,
  • అదిప్పుడు సజ్జల వద్ద ఉన్నదని ఫిర్యాదు


మదనపల్లి పోలీసు స్టేషన్‌లో దొంగలు పడ్డారు. రికార్డులేవీ పోలేదు. పోలీసులకు సంబంధించిన వస్తువులు కూడా పోలేదు. పోయిందల్లా.. ఒకే ఒక్క సెల్‌ఫోన్‌. అత్యంత సంచలనం సృష్టించిన జస్టిస్‌ ఈశ్వరయ్య ఆడియోటేపుల కేసులో కీలక సాక్ష్యం ఆ ఫోనే. అది జడ్జి రామకృష్ణది. సరిగ్గా ఆ ఫోనే పోయింది. అదొక్కటే ఎందుకు పోయిందంటారా? అదే చిదంబర రహస్యం!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జడ్జి రామకృష్ణ గుర్తున్నారు కదా! ఒకానొక సమయంలో హైకోర్టు జడ్జితోనే తలపడి సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. ఆ వివాదం అలా నడుస్తుండగానే, రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఈశ్వరయ్య ఆయన టచ్‌లోకి వెళ్లారు. ఓ నాలుగు మంచిమాటలు చెప్పారు. అంత వరకు బాగానే ఉంది.  కానీ, ఇక్కడే మరో సంచలనం చోటుచేసుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరిపై జస్టిస్‌ ఈశ్వరయ్య ఈ ఫోన్‌ సంభాషణ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. చీఫ్‌ జస్టి్‌సను, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆ తర్వాత కేసులు కూడా నమోదయ్యాయి. అవి ఇప్పుడు హైకోర్టు విచారణ పరిధిలో ఉన్నాయి. ఈ వ్యవహారంపై జస్టిస్‌ రవీంద్రన్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను హైకోర్టు నియమించింది. ఆ విచారణ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది. జస్టిస్‌ ఈశ్వరయ్య తనతో మాట్లాడారని, ఆ ఆడియోటేపులు నిజమని జడ్జి రామకృష్ణ కూడా ధ్రువీకరించారు. అయితే, ఆ కాల్‌రికార్డును కోర్టుకు సమర్పించేలోపే ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జడ్జి రామకృష్ణను మరో చిన్నకేసులో చిత్తూరు జిల్లా మదనపల్లిలో పోలీసులు అరె్‌స్టచేశారు.


ఆ సమయంలో ఆయన కారు, ఐఫోన్‌ సహా 17 రకాల వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. ఇది జరిగిన కొంతకాలానికి ఇన్‌స్పెక్టర్‌  కోర్టుకు ఓ ఆఫిడవిట్‌ సమర్పించారు. ఆ ఆఫిడవిట్‌ ప్రకారం జడ్జి రామకృష్ణ వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయి. కానీ ఒక్క సెల్‌ఫోన్‌ మాత్రం పోయింది. ఇదే విషయాన్ని మదనపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కోర్టుకు ఆఫిడవిట్‌ రూపంలో సమర్పించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కోర్టుకు సమర్పించిన నోట్‌లో ఏం పేర్కొన్నారంటే... ‘‘12-12-2020 నుంచి 25-02-2021 వరకు ఈ మధ్యకాలమున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు (సెల్‌ఫోన్‌) దొంగిలించారు. సదరు 25-02-2021వ తేదీన సీఆర్‌ నెం. 50/2021 యూ/సెక్షన్‌. 379 ఐపీసీగా మదనపల్లె టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ నందు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశాం’’ అని వివరించారు. ఐఫోన్‌ దొంగతనంపై కే సు నమోదు చేశామని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అందులో పేర్కొన్నారు. అయితే, జస్టిస్‌ ఈశ్వరయ్య తనతో మాట్లాడిన సంచలన అంశాలన్నీ ఆ ఫోన్‌లో భద్రపరిచి ఉన్నాయని, పోలీసులు ఆ ఫోన్‌ను మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయగా, ఆయన దాన్ని ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారని, ఈశ్వరయ్య కేసులో సాక్ష్యాలు లేకుండా చేయడం కోసమే ఫోన్‌ను మాయం చేశారన్నది జడ్జి రామకృష్ణ ఆరోపిస్తున్నారు. 


అక్కర్లేకున్నా సెల్‌ సీజ్‌..

సాధారణంగా ఒక కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినప్పుడు వారి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకొని వాటి వివరాలను ఫారమ్‌-24 ప్రకారం పొజిషనల్‌ ఇఫ్‌ ఇన్వెంటరీలో నమోదు చేస్తారు. ఏపీ పోలీసు మాన్యువల్‌ ప్రకారం ఇది తప్పనిసరి. కేసు విచారణకు ఆ వస్తువులు అవసరం లేదనుకుంటే నిందితుడి కుటుంబీకులు (బ్లడ్‌ రిలేషన్‌) లేదా అతని తరపున వాదించే న్యాయవాదికి వాటిని అందజేస్తారు. ఒకవేళ కేసు విచారణలో ఆ వస్తువులు కూడా అవసరం అనుకుంటే వాటిని మహజర్‌లో నమోదు చేస్తారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వాటిని సమర్పిస్తారు. కోర్టు అనుమతితో తిరిగి వాటిని పోలీసులు తీసుకుంటారు. నిందితుడిపై నమోదయిన కేసులో ఫోన్‌ కూడా కీలకమైన సాక్ష్యం అనుకుంటే దాన్ని భద్రపరుస్తారు. సైబర్‌ క్రైమ్‌ లాంటి కేసుల్లో ఫోన్‌, ల్యాప్‌టాప్‌ కీలకం.


ఫోన్ల ద్వారా జరిగే నేరాల్లోనూ అది కీలక మే. కోర్టు అనుమతితో నిందితుడి వస్తువులను విచారణకోసం తీసుకున్నాక వాటి రక్షణ బాధ్యత పోలీసులదే. అయితే, మదనపల్లి పోలీ్‌సస్టేషన్‌లో జడ్జి రామకృష్ణపై నమోదయిన కేసు వేరు. ఆ కేసులో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆయనకు తిరిగి ఇచ్చేయలే దు. పోలీసుల వద్దే ఉంచుకున్నారు. ఇందుకు కోర్టు అనుమతి తీసుకున్నారా? లేదా తేలాల్సి ఉంది.


దొంగ లెవరు?

జడ్జి రామకృష్ణ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ యథాతఽథంగా ఉండగా, ఫోన్‌ ఒక్కటే మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో జడ్జి రామకృష్ణ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులేవీ ఆయన కుటుంబీకులకు లేదా ఆయన న్యాయవాదికి అప్పగించలేదు. పోలీసుల వద్దే ఉంచుకోవడం, అందులో మరో కేసులో కీలకమైన ఐఫోన్‌ మాయం కావడం సంచలనంగా మారింది. పోలీసులు ముందుగా జడ్జి రామకృష్ణకు ఈ సమాచారం ఇవ్వలేదు. నే రుగా ఆఫిడవిట్‌ రూపంలో కోర్టుకు తెలిపారు. పోలీసు స్టేషన్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించిన దొంగలెవరో తేల్చకపోవడం పోలీసు వ్యవస్థకు మరో హైలెట్‌. ఈ కేసులో దొంగ లెవరు? అనుమానితులు ఎవరు? మరోవైపు ఈ మొత్తం  వ్యవహారంలో కుట్రకోణం ఉందని జడ్జి రామకృష్ణ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఆడియో ఉన్న ఐఫోన్‌ గల్లంతుకావడం రామకృష్ణ చేస్తున్న  ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 


జడ్జి రామకృష్ణ నుంచి సీజ్‌ చేసుకొన్న వస్తువులివే..

1) సుజుకి ఆల్టో కారు (నం.టీఎ్‌స07హెచ్‌బి9032) 2) ఒక బ్లాక్‌ కలర్‌ బ్యాగ్‌ 3) యాపిల్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌ 4) ఐఫోన్‌ 5) సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కేబుల్‌ 6) కొన్ని ట్యాబ్లెట్లు 7)ఆస్పత్రి ఔట్‌పేషంట్‌ (ఓపీ) షీట్‌ 8) జియో కంపెనీ డేటాకార్డు 9) రెండు నలుపురంగు లగేజీ బ్యాగ్‌లు 10) ఒకపర్సు 11) యూనియన్‌ బ్యాంకు కార్డు 12) ఎస్‌బీఐ ప్లాటినమ్‌ డెబిట్‌కార్డు 13) పాన్‌కార్డు 14) ఆధార్‌ కార్డు 15) ఐడీ కార్డు 16) రూ.4014 17) రెండు స్టీల్‌ పైపులు(18 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు).


జస్టిస్‌ ఈశ్వరయ్యను కాపాడేందుకే...: జడ్జి రామకృష్ణ

‘‘నా ఫోన్‌ పోలీసులే మాయం చేశారు. కేసులో కీలక ఆధారమైన జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ ఆ ఫోన్‌లోనే ఉన్నాయి. ఎవరో చోరీ చేశారని పోలీసులు చెబుతున్నది నిజం కాదు. పోలీసులే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్‌ను అప్పగించారు. వైసీపీ పెద్దలు దీని వెనుక ఉన్నారు. నా ఫోన్‌ నాకు అప్పగించాలని నేను కోర్టును ఆశ్రయించగా, కోర్టు పోలీసులకు డైరెక్షన్‌ ఇచ్చింది. అయితే దానిని కోర్టులో ప్రొడ్యూస్‌ చేయకుండా 90 రోజులు పోలీసులు కాలయాపన చేశారు. చివరకు ఫోన్‌ చోరీ అయిందని మూడు రోజుల కిందట కోర్టులో మెమో ఫైల్‌ చేశారు. వాస్తవానికి అరెస్టు అయిన వ్యక్తులకు సంబంధించిన ప్రాపర్టీని 24 గంటలలోపు పోలీసులు కోర్టులో డిపాజిట్‌ చేయాలి.


మదనపల్లె పోలీసులు అలా చేయలేదు. జస్టిస్‌ ఈశ్వరయ్యను సీబీఐ విచారణ నుంచి కాపాడాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారు. పోలీసులే ఫోన్‌ను తస్కరించి మంత్రి పెద్దిరెడ్డి ద్వారా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు. న్యాయసూత్రాలను తుంగలో తొక్కి, పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది. ఈ వ్యవహారంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాను. న్యాయవ్యవస్థను కాపాడటం కోసమే నేనే వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నాను’’

Updated Date - 2021-03-21T09:04:53+05:30 IST