పరిధి దాటితేనే కోర్టుల జోక్యం

ABN , First Publish Date - 2021-12-26T07:29:19+05:30 IST

పరిధి దాటితేనే కోర్టుల జోక్యం

పరిధి దాటితేనే కోర్టుల జోక్యం

అన్ని వ్యవస్థలూ చట్టానికి లోబడి పనిచేయాలి

ఆర్టికల్‌ 19, 21 రాజ్యాంగానికి గుండెకాయ

న్యాయవ్యవస్థకు సైతం ప్రాథమిక సమస్యలు

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ వెల్లడి

సీజేఐకి విజయవాడ రోటరీ క్లబ్‌ సత్కారం.. 

జీవన సాఫల్య పురస్కారం ప్రదానం


విజయవాడ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే, ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి రాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు పరిధి దాటినప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థ అయినా, న్యాయవ్యవస్థ అయినా పరిఽధికి లోబడి పనిచేయాలని సూచించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జస్టిస్‌ రమణకు శనివారం రాత్రి జీవన సాఫల్య పురస్కారం, సిద్ధార్థ అకాడమీ సిద్ధార్థ పురస్కారాన్ని అందజేశాయి. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘రాజ్యాంగానికి ఆర్టికల్‌ 19, 21 గుండె వంటివి. సమాజంలో పౌరహక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకుంటాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంలో రాజ్యాంగంపై విస్తృతంగా చర్చ జరుగుతుండడం మంచి పరిణామం. రాజ్యాంగం కొద్దిరోజుల క్రితం వరకు గ్రంథాలయాలకు పరిమితమై ఉండేది. ఇప్పుడు దానిపై ఇళ్లల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి’’ అని ఆయన తెలిపారు. తమ హక్కులు, బాధ్యతలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇంకా నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, మూఢనమ్మకాలు ఉన్నాయి.  వాటిని రూపుమాపడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అప్పుడే వారికి రాజ్యాంగంపై అవగాహన పెరుగుతుంది. అత్యంత ముఖ్యమైన రూల్‌ ఆఫ్‌ లా ప్రజలకు వివరించాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది’’ అని జస్టిస్‌ రమణ అన్నారు.  సమాజంలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లను మేధావివర్గంగా భావిస్తారని, ప్రజలు వారిపై అనేక ఆశలు పెట్టుకుంటారని చెప్పారు. ప్రజలకు దశదిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ఈ వర్గంపై ఉందని, అప్పుడే దేశానికి, రాజ్యాంగానికి గౌరవం చేకూర్చినట్టవుతుందని స్పష్టం చేశారు.  ‘‘అన్ని వ్యవస్థల మాదిరిగానే న్యాయవ్యవస్థా ప్రాథమిక సమస్యలను ఎదుర్కొంటోంది. నాకు ముందు సీజేలుగా పనిచేసిన వారు ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. నా  తర్వాత పనిచేసేవారూ ఎదుర్కొంటారు.


ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రాధాన్యాన్ని మరచిపోయే పరిస్థితి ఉంది. పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు, సమస్యలు ఉత్పన్నమయినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయస్థానాలు గుర్తుకొస్తున్నాయి. న్యాయస్థానాలకు వెళ్లకపోవడమే మంచిదన్న భావన చాలామందిలో ఉంది. ఇందుకోసమే న్యాయవ్యవస్థను భారతీకరణ చెందించాలి. ఒక కేసు గురించి ఇద్దరు న్యాయవాదులు, న్యాయమూర్తి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతున్నాయో కక్షిదారులకు తెలియాల్సిన అవసరం ఉంది. అర్థం కాని విధానాలు, పద్ధతుల వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారు. 140కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నాలుగు కోట్లకుపైగా కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి.


అయితే, జనాభా సంఖ్యతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య పెద్దదేమీ కాదు. చిన్నచిన్న కేసులను వాయిదాల పేరుతో సాగదీయకుండా న్యాయం చేసే బాధ్యత న్యాయస్థానాల పైనే కాకుండా ప్రభుత్వాల పైనా ఉంది. ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు న్యాయస్థానాలకు నూతన భవనాలను నెలకొల్పాలి’’ అని జస్టిస్‌ రమణ సూచించారు. కాగా, సత్కారానికి ముందు జస్టిస్‌ రమణకు చినజీయర్‌ ఆశ్రమానికి చెందిన పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T07:29:19+05:30 IST