ధూళిపాళ్ల పిటిషన్‌పై నేడూ హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-05-21T09:49:36+05:30 IST
టీడీపీ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది

అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినేందుకు విచారణను కోర్టు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ... ‘గత నెల 23న పిటిషనర్లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించి దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. పిటిషనర్లను ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే వారు రికార్డులు తారుమారు చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం కాదు. పిటిషనర్లు జైల్లో కరోనాబారినపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స అనంతరం జైలుకి తరలిస్తే వారి ప్రాణాలకు మప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ... బెయిల్ విషయంలో అభిప్రాయం చెప్పాలని ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, దస్త్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఏజీ తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తులో జోక్యం చేసుకొనే అవకాశం ఉందన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారు బెయిల్ కోసం వేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కాగా, నరేంద్రకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయడానికి ఈనెల 24 వరకు గడువును పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం ఆదేశాలు ఇచ్చింది.