వృద్ధి రేటు పాతాళానికి!
ABN , First Publish Date - 2021-05-21T09:05:26+05:30 IST
రాష్ట్రం తొలిసారిగా నెగెటివ్ వృద్ధి రేటులోకి వెళ్లిపోయింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి మైనస్ 2.58 శాతంగా నమోదైంది

రాష్ట్రంలో తొలిసారి నెగెటివ్‌గా నమోదు
స్థూల రాష్ర్టోత్పత్తి మైనస్ 2.58 శాతం
పారిశ్రామిక, సేవా రంగాలూ మైన్‌సలలోకే
ఆర్థిక సర్వేలో వెల్లడి
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం తొలిసారిగా నెగెటివ్ వృద్ధి రేటులోకి వెళ్లిపోయింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి మైనస్ 2.58 శాతంగా నమోదైంది. పరిశ్రమలు, సేవారంగాల వృద్ధి రేటు సైతం మైన్‌సలలోకి పడిపోయింది. మరోవైపు తలసరి ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే పెద్దగా పెరిగిందేమీ లేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.03శాతం మాత్రమే పెరిగింది. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. స్థిర ధరల ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 2019-20లో రూ.6,68,848 కోట్లు ఉండగా... 2020-21లో సవరించిన అంచనాల ప్రకారం రూ.6,51,624 కోట్లుగా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే జీఎ్‌సడీపీ వృద్ధి రేటు మైనస్ 2.58 శాతానికి పడిపోయింది. పారిశ్రామిక రంగ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లి మైనస్ వృద్ధి రేటు నమోదైంది. సేవా రంగంలో బ్యాంకింగ్ లాంటివి తప్ప రియల్ ఎస్టేట్, రవాణా తదితర రంగాలన్నీ మైనస్ వృద్ధి రేటు నమోదు చేశాయి. తలసరి ఆదాయం స్వల్పంగా పెరిగినా గత ఐదేళ్లతో పోలిస్తే అది నామమాత్రమే. గతేడాదితో పోలిస్తే కేవలం రూ.1,700 మాత్రమే పెరుగుదల కనిపించింది. అయితే జాతీయ తలసరి ఆదాయ సగటుకంటే ఏపీ కొంత మెరుగ్గా ఉందని సర్వేలో పేర్కొన్నారు. మరోవైపు ఈ రెండేళ్లలో ప్రభుత్వ రాబడి పెరిగిందేమీ లేదు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం 58,107 కోట్లు ఉండగా 2019-20లో 57,601కోట్లు, 2020-21లో .57,378 కోట్లు సమకూరింది. రాబడి పెరగలేదు కానీ అప్పులు, కేంద్రం ఇచ్చే నిధులు పెరిగాయి.
అప్పులు భారీగా... వడ్డీలు భారంగా
ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగలేదు కానీ అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని సర్వే స్పష్టం చేసింది. 2018-19 నాటికి సుమారు రూ.2లక్షల కోట్లు ఉన్న అప్పులు, 2019-20 నాటికి రూ.3,01,802 కోట్లకు, 2020-21 నాటికి రూ.3,55,839 కోట్లకు పెరిగాయి. వడ్డీ చెల్లింపుల భారం కూడా పెరిగింది. గతేడాది అప్పులపై వడ్డీలకు 17,653 కోట్లు చెల్లించగా, ఈ ఏడాది 22,026 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 2019-20లో సాధారణ రకం బియ్యం కిలో రూ.30.7 ఉంటే, 2020-21లో రూ.31.95కు పెరిగింది. కందిపప్పు 81.9 నుంచి 91.96కు, వేరుశనగనూనె 117.42 నుంచి 145కు చేరింది. కొవిడ్, వరుస విపత్తులు ఉన్నా.. వ్యవసాయ రంగం 1.92లక్షల కోట్ల జీవీఏతో 4.16ువృద్ధి రేటు సాధించింది. ఉద్యానశాఖ 10.17ు, మత్స్య, ఆక్వా రంగాలు 4.94ు వృద్ధి రేటు సాధించాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసింది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ను లాభాల్లో నడిపేందుకు ఐదు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు.
ఇదొక వినాశకర బడ్జెట్: శైలజానాథ్
శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన ‘బడ్జెట్‌లో అప్పులు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇది రాష్ట్రానికి వినాశకర, తిరోగమన బడ్జెట్. కేటాయింపుల్లో నవరత్నాలకు తప్ప మిగిలిన ఏ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు’’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. ఇది పూర్తిగా కోతలు, కూతల బడ్జెట్ అని తులసిరెడ్డి మండిపడ్డారు.
అభివృద్ధి ఏది జగన్ గారూ..!: రామకృష్ణ
బడ్జెట్‌లో అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పెదవి విరిచారు. ప్రపంచ దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించలేదని విమర్శించారు.
ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి లేదు: జనసేన
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రజారోగ్యంపై దృష్టిసారించలేదని జనసేన నేత మనోహర్ అన్నారు. ప్రజారోగ్యానికి ప్రత్యేక బడ్టెట్ ప్రవేశపెట్టి ఉంటే బాగుండేదన్నారు.