‘శ్మశానాల బాధ్యత’ సర్కారుదే!

ABN , First Publish Date - 2021-08-21T08:41:12+05:30 IST

శ్మశానవాటికలు, శవదహనశాలలు లేకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ని ఆర్టికల్‌ 21 ప్రసాదించిన జీవించేహక్కులో భాగం గా.. మనిషి బతికున్నప్పుడే కాకుండా.. మరణించిన తరువాత కూడా గౌరవ మర్యాదలు వర్తిస్తాయని

‘శ్మశానాల బాధ్యత’ సర్కారుదే!

మృతదేహానికీ గౌరవమర్యాదలుంటాయి!

కొన్నివర్గాలకు శ్మశానాల్లేకపోవడం దురదృష్టకరం

పెదకాకానిలో ఆక్రమణలోని శ్మశాన స్థల సర్వేకు హైకోర్టు ఆదేశం

శ్మశానవాటికలు, శవదహనశాలలు లేకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ని ఆర్టికల్‌ 21 ప్రసాదించిన జీవించేహక్కులో భాగం గా.. మనిషి బతికున్నప్పుడే కాకుండా.. మరణించిన తరువాత కూడా గౌరవ మర్యాదలు వర్తిస్తాయని.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పునరుద్ఘాటించిందని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమస్య తీవ్రతను గుర్తించి.. మతం, ప్రాంతం, కులం, లింగంభేదంతో సంబంధం లేకుండా.. మరణించిన వ్యక్తులకు.. వారి ఆచారాలకు అనుగుణంగా గౌరవప్రదంగా ఖననం లేదా దహనసంస్కారాలు చేసుకొనేందుకు వీలుగా శ్మశానాలు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నట్లు పేర్కొంది. తగిన చర్యలు తీసుకొనేందుకు తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో శ్మశానవాటికకు చెందిన సర్వే నం.153 స్థలాన్ని పిటిషనర్లు, సంబంధిత వ్యక్తుల సమక్షంలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. శ్మశానవాటిక ఆక్రమణకు గురైందని గుర్తిస్తే చట్టప్రకారం తక్షణం ఆక్రమణదారులను తొలగించి భూమిని నాలుగు వారాల్లో ఎస్సీ వర్గానికి శ్మశానవాటిక నిమిత్తం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. వివరాలివీ.. గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, పెదకాకాని సర్వే నం. 153 హిందూ శ్మశానవాటికలోని కొంత భూమిని ఎస్సీ వర్గం వారికి కేటాయించడానికి అధికారులు ప్రతిపాదించడాన్ని సవాల్‌ చేస్తూ గొట్టిముక్కల రత్తయ్య మరో 8మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారం పై పెదకాకాని తాహ సీల్దార్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. సర్వే నం. 153లో మొత్తం 0.95 సెంట్లలో ప్రభుత్వ పోరంబోకు(శ్మశానవాటిక) ఉందని, అందులో 0.71 సెంట్లలో హిందూ శ్మశానవాటిక ఉందని తెలిపారు. మిగిలిన 0.24 సెంట్ల భూమిని పిటిషనర్‌ రత్తయ్య ఆక్రమించుకొని తన పొలంతో కలిపి సాగుచేసుకుంటున్నట్లు వివరించారు. ఆ ఆక్రమణ స్థలానే ఎస్సీ వర్గంవారి శ్మశాన అవసరాల కోసం గుర్తించామన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పెదకాకాని పరిధిలోని వివిధ కాలనీల వారు శ్మశానవాటిక లేక గత 50 ఏళ్లుగా చెరువుకట్టమీదే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారని.. దీంతో పెదకాకాని, చుట్టుపక్కల గ్రామాలవారు అభ్యంతరం తెలుపుతున్న విషయం విచారణ సందర్భంగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా... కొన్ని వర్గాల ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం/ స్థానిక సంస్థలు శవదహనశాలలు, శ్మశానవాటికలు, విద్యుత్‌ శవదహనశాలలు సక్రమంగా నిర్వహించాల్సి ఉందని పేర్కొందన్నారు. ఐపీసీ సెక్షన్‌ 297 ప్రకారం శ్మశానవాటికల ఆక్రమణను నిలువరించడంతో పాటు మృతుల అంత్యక్రియలు సజావుగా జరిగేందుకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ప్ర స్తుత కేసులో మొత్తం 0.95 సెంట్ల శ్మశాన భూమిలో 0.24 సెంట్లను ఎస్సీ వర్గానికి కేటాయించడం చట్టవిరుద్ధం కాదని, పిటిషనర్ల హక్కులకు భంగం కలగలేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌ 22న పిటిషనర్లు ఇచ్చిన వినతి ఆధారంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-08-21T08:41:12+05:30 IST