టికెట్ల జీవో చెల్లదు
ABN , First Publish Date - 2021-12-15T08:08:21+05:30 IST
టికెట్ల జీవో చెల్లదు

సినిమా టికెట్ల ధరలపై వైసీపీ ప్రభుత్వానికి షాక్
జీవో 35ను నిలిపివేసిన హైకోర్టు
భౌగోళికంగా వర్గీకరించి ధరలు నిర్ణయించడానికి వీల్లేదు
కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వం వహించలేదు
గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా జీవో: ధర్మాసనం
మునుపటిలాగే టికెట్ల ధరలు నిర్ణయించుకొనే వెసులుబాటు
మధ్యంతర ఉత్తర్వులు జారీ
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో 35ను సస్పెండ్ చేసింది. జీవో జారీకి పూర్వం ఉన్న విధానంలోనే టికెట్ ధరలు నిర్ణయించేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించింది. టికెట్ ధర నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని లైసెన్సింగ్ అథారిటీ(జాయింట్ కలెక్టర్)కి తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. జీవో 35 గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. టికెట్ ధరలపై వేసే కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వం వహించాలని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యుడిగా మాత్రమే ఉన్నారని అభ్యంతరం తెలిపారు. అలాగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలను భౌగోళికంగా వర్గీకరించి టికెట్ల ధరలు నిర్ణయించడానికి వీల్లేదని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 35 ఉందన్నారు. అందుకే జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలుగా వర్గీకరించి సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి జారీ చేసిన జీవో 35ని సవాల్ చేస్తూ తెనాలికి చెందిన లక్ష్మిశ్రీలక్ష్మి థియేటర్ మేనేజర్ వాసుదేవరావుతో పాటు మరికొందరు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.
నామమాత్రపు ధరలతో మనగడ ఉండదు..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘జీవో 35 గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉంది. టికెట్ల ధరలు నిర్ణయించే కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలకు చోటు కల్పించలేదు. కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వం వహించలేదు. భౌగోళిక ఆధారంగా టికెట్ల ధరలు నిర్ణయించడానికి వీల్లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35ను జారీ చేసింది. భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలకు నామమాత్రపు టికెట్ ధరలు రూ.10, రూ.100 నిర్ణయిస్తే థియేటర్లు మనుగడ సాధించలేవు. సాంకేతిక పరిజ్ఞానం, పోటీతత్వం పెరిగింది. మద్యం ధరలు నియంత్రించలేని ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను, వ్యాపారాన్ని నియంత్రించాలని చూస్తొంది. ఆ జీవో ద్వారా సినిమా బిజినె్‌సలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చూస్తోంది. టికెట్ ధరలను పరిస్థితికి తగ్గట్లు మార్చుకొనేందుకు వెసులుబాటు కల్పించండి. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయండి’ అని కోరారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్వర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..‘టికెట్ ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. టికెట్ ధరలు నిర్ణయించేందుకు వేసిన కమిటీలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యుడిగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఇతర భాగస్వామ్యుల అభ్యంతరాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ ధరలు పెంచుకుంటామనడం సరికాదు. సామాన్య ప్రజలు, ప్రైవేటు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ధరలు నిర్ణయించాం. వ్యాజ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొదు’్ద అని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రభుత్వం ఇచ్చిన జీవో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు.
పరిశ్రమకు పెద్ద ఊరట..
టికెట్ ధరలపై హైకోర్టు తీర్పుతో సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట కలిగినట్టే. ఐదు రూపాయలకు చాక్లెట్ రావడం లేదు. ఈ ధరలకు రెండు గంటలపాటు సినిమా చూపించాలని నిర్ణయించడం చాలా బాధాకరం.
ఆ ధరలకు కనీసం థియేటర్ నిర్వహణ ఖర్చులూ రావు. ఈ ధరలు గిట్టుబాటు కావని ఎగ్జిబిటర్లంతా ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. ప్రభుత్వం మా మాట పట్టించుకోలేదు. ఈనెల నుంచి సంక్రాంతి వరకు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తీర్పుతో సినీ పరిశ్రమకు మేలు జరుగుతుంది. ఎగ్జిబిటర్ల ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుని మా సమస్యలను పరిష్కరించాలి. -సాయిప్రసాద్, ఎగ్జిబిటర్
నాణ్యమైన సినిమాలు నిర్మించాలంటే..
ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో టికెట్ ధరలపై అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉందో వివరించాం. అయినా దయ చూపలేదు, సరికదా మమ్మల్ని దోపిడీదారులుగా ప్రకటించడం బాఽధ కలిగించింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే మా అంతిమ లక్ష్యం. బడ్జెట్‌ను బట్టి సినిమా టికెట్ ధర ఉంటేనే నాణ్యమైన సినిమాలు నిర్మాణమవుతాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు తగ్గించాలి. హైకోర్టు తీర్పు ద్వారా న్యాయం జరగడం సంతోషంగా ఉంది.
-రమేష్, తెలుగు చలనచిత్ర మండలి కార్యదర్శి