కరోనా వచ్చిన బాలికను కాటేశారు!

ABN , First Publish Date - 2021-12-26T08:14:24+05:30 IST

కరోనా వచ్చిన బాలికను కాటేశారు!

కరోనా వచ్చిన బాలికను కాటేశారు!

అనారోగ్యంతో జీజీహెచ్‌లో చేరిన తల్లీకూతుళ్లు

కరోనాతో చనిపోయిన తల్లి

బాలికను వ్యభిచారంలోకి దింపిన మహిళ

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 6 నెలలుగా వ్యాపారం


గుంటూరు, డిసెంబరు 25: ఆ తల్లీకూతుళ్లకు కరోనా సోకింది. వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన తల్లిని కరోనా బలి తీసుకోగా.. బాలికకు ఆయుర్వేద మందు ఇస్తానని లోబర్చుకున్న మహిళ.. ఆమె జీవితాన్నే కాటేసింది. ఆమెను వ్యభిచారకూపంలోకి దింపి.. రాష్ట్రమంతటా తిప్పుతూ ఆరు నెలలుగా వ్యాపారం చేయించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 13 మంది వ్యభిచార నిర్వాహకులను, పది మంది విటులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, వెస్టు డీఎస్పీ కె.సుప్రజ తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన మన్నవ స్వర్ణకుమారి గుంటూరు ద్వారకానగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించేది. మరోవైపు కరోనాకు ఆయుర్వేద మందు ఇస్తానంటూ జీజీహెచ్‌లో తిరుగుతుండేది. ఈ క్రమంలో గత జూన్‌లో పేరేచర్ల ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ఆమెను జీజీహెచ్‌లో చేర్చారు. ఆతర్వాత వారి కుమార్తె కూడా కరోనా బారినపడింది. జీజీహెచ్‌లో బాధితురాలి భర్తకు స్వర్ణకుమారి పరిచయమై కరోనాకు నాటుమందు ఇస్తానని చెప్పి ఆయన కూతురును తన వద్దకు పంపమని కోరింది. దీంతో వారి కూతురును స్వర్ణకుమారికి అప్పజెప్పగా చైతన్యపురిలోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఆతర్వాత బాలిక తల్లి కరోనాతో కన్నుమూసింది. అప్పటి నుంచి స్వర్ణకుమారి బాలికను నిర్బంధించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించింది. బాలికను విజయవాడ, హైదరాబాద్‌, నెల్లూరు, తణుకు, కాకినాడ తదితర ప్రాంతాలకు పంపి వ్యభిచారం చేయించింది. నెల్లూరు పంపినప్పుడు బాలిక తప్పించుకుని విజయవాడ బస్టాండ్‌కు చేరుకోగా.. అక్కడ నాగలక్ష్మి అనే మహిళ చేరదీసి.. బాలికతో  వ్యభిచారం చేయించింది. విజయవాడకు చెందిన సురేశ్‌ అనే వ్యక్తి కూడా బాలికతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌, కాకినాడ, తణుకు కూడా తీసుకెళ్లారు. బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించాక తండ్రి వద్దకు పంపారు. ఈ విషయమై ఆమె తండ్రి ఈ నెల 16న మేడికొండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఈ నెల 18న కేసును అరండల్‌పేటకు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరుకు చెందిన మన్నవ స్వర్ణకుమారి, కృష్ణా జిల్లా గుంటుపల్లికి చెందిన యన్నం జసింత, ఐలా హేమలత, విజయవాడ కానూరుకు చెందిన గుండు పుణ్యవతి అలియాస్‌ నాగలక్ష్మి ఆమె భర్త కిరణ్‌కుమార్‌, పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం గోగుంటకు చెందిన చిన్న రవికుమార్‌, హైదరాబాద్‌ యూస్‌ఫగూడకు చెందిన మల్లెం రమాదేవి, కుంచాల ధన, నెల్లూరు టౌన్‌కు చెందిన వడ్ల అలియాస్‌ గోనెల వెంకట కళ్యాణి అలియాస్‌ లక్ష్మి, ఆమె భర్త గణేష్‌, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం సజ్జాపురానికి చెందిన కొమ్మిరెడ్డి భాస్కర్‌, విజయవాడ సింగునగర్‌కు చెందిన బండి అశ్వనీలతోపాటు మరో పది మంది విటులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. బాలికను బలవంతంగా ముందుగా వ్యభిచార రొంపిలోకి దించిన స్వర్ణకుమారి సినీ నిర్మాత అని పోలీసులు తెలిపారు. ఆమె మిస్సింగ్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కూడా నిర్మించారని చెప్పారు. ఈ ముఠా నుంచి 12 సెల్‌ఫోన్లు, వెయ్యి నగదు, బంగారపు ఉంగరం, కారు, రెండు ప్రామిసరీ నోట్లు, లాకెట్‌, బాధితురాలి ఒరిజినల్‌ టీసీని సీజ్‌ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-26T08:14:24+05:30 IST