ఏపీ భవిష్యత్తు ఆందోళనకరం

ABN , First Publish Date - 2021-12-15T07:41:03+05:30 IST

రాష్ట్ర భవిష్యత్తుపై అధికార పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోయిందని పార్లమెంటు వేదికపైనే అసహాయత ప్రదర్శించింది. ‘ఆదుకోండి ప్లీజ్‌’ అని కేంద్రాన్ని ప్రాధేయపడింది.

ఏపీ భవిష్యత్తు ఆందోళనకరం

పార్లమెంట్‌లో వైసీపీ హాహాకారం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయం

భరించదగిన స్థాయి దాటిపోయింది

బయటపడే మార్గం కనిపించడంలేదు

సానుభూతి చూపి సహకరించండి

విభజన హామీలపై కేంద్రం 

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి విజ్ఞప్తి


న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తుపై అధికార పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోయిందని పార్లమెంటు వేదికపైనే అసహాయత ప్రదర్శించింది. ‘ఆదుకోండి ప్లీజ్‌’ అని కేంద్రాన్ని ప్రాధేయపడింది. లోక్‌సభలో అదనపు పద్దులపై జరిగిన చర్చలో మంగళవారం వైసీపీ  లోక్‌సభా పక్ష నేత  మిథున్‌రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తుపై చాలా ఆందోళన చెందుతున్నాం. దీని నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహకరించండి’’ అని కేంద్రాన్ని వేడుకున్నారు. తమ పట్ల సానుభూతి చూపించాలని కోరారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను  వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం పార్లమెంటులో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా రాష్ట్రం ఆర్థిక భారాన్ని భరించే స్థాయి దాటిపోయింది’’ అని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్రమే సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను పదేళ్లలో పూర్తి చేయాలని ఉందని, కానీ ఇప్పటికి దాదాపు 8 ఏళ్లు గడిచిపోయినా తగిన సహకారం అందడంలేదని తెలిపారు. చట్టంలోని అనేక హామీలను నెరవేర్చలేదని, వాటిని బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇదికాకుండా.. పోలవరం, రెవెన్యూ లోటు, పెట్రో కారిడార్‌, వెనుకబడిన జిల్లాలకు నిధుల వంటి అనేక అంశాలు ఉన్నాయని వివరించారు. ఏపీ పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తొలుత కేంద్రం అనేక కొర్రీలు వేసిందని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా తాగునీటి కంపోనెంట్‌కు నిధులు ఇవ్వబోమని చెప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.55,656 కోట్ల పోలవరం ప్రాజెక్టు సవరణ అంచనాలను కూడా కేంద్రం ఇంకా ఆమోదించలేదన్నారు. కాగా, రాష్ట్ర విభజనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకోకపోయినా, ఈ ఒక్క విషయంలోనే యూపీఏ, ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని విభజించాయని వాపోయారు. ఇప్పుడు తాము మంచి పరిస్థితిలో లేమని వాపోయారు. పౌర సరఫరాల శాఖ పెండింగ్‌ బకాయిలు, రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టానికి గాను రూ.100 కోట్లు మధ్యంతర సాయంగా విడుదల చేయాలని, కేంద్ర బృందాన్ని పంపించి నష్టాన్ని అంచనా వేయాలని ప్రతిపాదించారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని కోరారు. ఇంకా, క్రిప్టోకరెన్సీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని, ఎంపీల్యాడ్స్‌ నిధులను పెంచాలని మిథున్‌రెడ్డి కోరారు. 

Updated Date - 2021-12-15T07:41:03+05:30 IST