రాష్ట్ర ఆర్థిక స్థితి అంత దయనీయమా!

ABN , First Publish Date - 2021-06-22T07:58:43+05:30 IST

ఎప్పుడో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘డబ్బుల్లేవు’ అని సర్కారు చెప్పిన సమాధానంపై ఆగ్రహించింది

రాష్ట్ర ఆర్థిక స్థితి అంత దయనీయమా!

పనులు చేసినందుకు బిల్లులు ఇవ్వరా?

నిధులు లేవని చెప్పడమా?

మరి 3 రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకొస్తారు?

ఆర్థిక స్థితిపై పూర్తి సమాచారం ఇవ్వండి

ఆర్థిక, పంచాయతీరాజ్‌ కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం


అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘డబ్బుల్లేవు’ అని సర్కారు చెప్పిన సమాధానంపై ఆగ్రహించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆర్థికశాఖ, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. ‘‘బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నారు. ఈ వాదనతో రాష్ట్ర ఆర్థిక స్థితి దయనీయంగా ఉందనే అభిప్రాయం కలుగుతోంది’’ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు... సకాలంలో బిల్లులు చెల్లించకపోతే ప్రతిపాదిత మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించింది. 2018, 2019లో ఉపాధి హామీ కింద చేపట్టిన పలు పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన సీకే ఎర్రం రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్‌.శ్రీనివాసరావు హైకోర్టులో వేరు వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఒక రహదారి పనులు చేసిన తనకు...  రూ.21.41 లక్షల బిల్లులు ఫైనలైజ్‌ అయినా డబ్బులు చెల్లించడం లేదని ఎర్రం రెడ్డి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం, ఎస్‌డీఎఫ్‌ పనులకు సంబంధించి రూ. 26.39 లక్షలు చెల్లించలేదంటూ ఆర్‌.శ్రీనివాసరావు వ్యాజ్యం వేశారు. 


ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కె.సురేశ్‌ కుమార్‌ రెడ్డి, బి.సత్యనారాయణ వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల పిటిషనర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి రావడంతో మానసిక వేదనకు గురవుతున్నారు’’ అని తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ...ప్రభుత్వం దగ్గర నిధులు అందుబాటులో లేనందున పిటిషనర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఆ వాదనలపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక స్థితి దయనీయ పరిస్థితిలో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని తెలిపారు. అధికారుల చర్య పిటిషనర్లు, వారి కుటుంబ సభ్యుల జీవించే హక్కును హరించేదిగా ఉందన్నారు. ఇది సమాజంలో పిటిషనర్ల గౌరవాన్ని, హుందాతనాన్ని దెబ్బతీస్తుందన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే....  పిటిషనర్లు పనులు చేయడానికి సేకరించిన మెటీరియల్‌తోపాటు కార్మికులకు డబ్బులు ఎలా చెల్లిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిటిషనర్లకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోయారో కారణాలు వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.Updated Date - 2021-06-22T07:58:43+05:30 IST