కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-29T20:47:21+05:30 IST

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఫ్లెక్సీల చించివేతకు ప్రతీకారంగా

కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

చిత్తూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఫ్లెక్సీల చించివేతకు ప్రతీకారంగా వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశారు. ఆర్అండ్‌బీ రోడ్‌ నుంచి కుప్పంలోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను టీడీపీ శ్రేణులు చించివేశాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొడుతున్నారు. ప్రస్తుతం కుప్పంలో భారీ వర్షం పడుతోంది. చంద్రబాబు పర్యటనకు అంతరాయం ఏర్పడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.


చంద్రబాబు రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కుప్పం వచ్చారు. జిల్లాలో రెండేళ్లకు పైగా స్తబ్దుగా వుండిపోయిన టీడీపీ శ్రేణులు ఇపుడిపుడే పుంజుకుంటున్నాయి. మంగళగిరిలో ఇటీవల టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై జిల్లా పార్టీ శ్రేణులు స్పందించిన తీరు గమనిస్తే ఇది స్పష్టమవుతోంది. నాయకులతో పాటూ కార్యకర్తలు కూడా ఆవేశంగా రోడ్లపైకి వచ్చారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. ఆశ్చర్యకరంగా సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కూడా ఈ వాతావరణం కనిపించింది.


Updated Date - 2021-10-29T20:47:21+05:30 IST