ఆలయ సేవ అందరికీ!

ABN , First Publish Date - 2021-10-14T09:11:21+05:30 IST

ఆలయ సేవ అందరికీ!

ఆలయ సేవ అందరికీ!

ఏ ఆలయానికైనా ‘డిప్యుటేషన్‌’.. దేవుడి శాఖలోకి అందరికీ ఆహ్వానం

ఖాళీల భర్తీ పట్టకుండా.. కొత్త విన్యాసం

దేవదాయ చట్టానికి కీలక సవరణ

వచ్చే కేబినెట్‌లో పెట్టాలని నిర్ణయం

ప్రస్తుతం పెద్ద ఆలయాలకే డిప్యుటేషన్‌

ఇకపై చిన్న ఆలయాలకూ వచ్చే అవకాశం

శాఖ స్వరూపాన్నే మార్చేస్తున్న ప్రభుత్వం 


దేవదాయశాఖలో ఉద్యోగం అంటేనే.. హిందూ ధర్మం మీద నమ్మకం, దేవుడిమీద భక్తి ఉండాలి. ఇవి ఉంటేతప్ప.. ఆ శాఖలో ఉద్యోగమే ఇవ్వరు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు.. ఈ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయడాన్ని పక్కన పెట్టి.. ఇతర శాఖల నుంచి ఉద్యోగులను డెప్యుటేషన్‌పై తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఏకంగా చట్టానికే సవరణలు చేపడుతుండడంపై దేవదాయశాఖ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

దేవదాయశాఖ స్వరూపాన్ని మార్చేసేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. దేవుడి శాఖలోకి అందరూ రావొచ్చని ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు పెద్ద ఆలయాల్లోకి మాత్రమే రెవెన్యూ ఉద్యోగులు డిప్యుటేషన్‌పై వచ్చేందుకు వెసులుబాటు ఉండగా, ఇక నుంచి ఏ స్థాయి ఆలయానికైనా అన్నిశాఖల ఉద్యోగులు వచ్చేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు దేవదాయశాఖ చట్టానికి, నిబంధనలకు కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించింది. వచ్చే కేబినెట్‌లో ఈ ప్రతిపాదనలు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో దేవదాయశాఖ స్వరూపాన్నే జగన్‌ ప్రభుత్వం మార్చేస్తోందని ఆ శాఖ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. 


ఇతర శాఖల ‘విశ్వాసం’ ఏంటి?

ప్రభుత్వంలో ఇతర శాఖలకు, దేవదాయశాఖకు స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో దేవుడిపై విశ్వాసంతో సంబంధం ఉండదు. కానీ, దేవదాయశాఖలో ఉద్యోగం పొందాలంటే హిందూ మతంపై విశ్వాసం ఉండాలన్న నిబంధన ఉంది. దీనికి అంగీకరిస్తేనే ఎవరైనా ఆ శాఖలో ఉద్యోగం చేయడానికి అర్హులవుతారు. ఒకవేళ ఉద్యోగంలో చేరాక విశ్వాసం లేదని రుజువైనా వారిని అక్కడి నుంచి తప్పించేందుకూ అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే దేవదాయశాఖలోని ఉద్యోగుల వ్యవహారంలో అనేక వివాదాలు ఉన్నాయి. కాగా, ఇప్పుడు అన్ని శాఖలవారూ ఆలయాల్లోకి రావొచ్చని ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తే.. మరిన్ని వివాదాలు పెరగడం ఖాయమని ఉద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏడు పెద్ద ఆలయాలు ఉంటే వాటిలో ఐదు ఆలయాలకు రెవెన్యూ అధికారులే ఈవోలుగా ఉన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు డిప్యుటేషన్‌పై ఈవోలుగా పనిచేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ గుడి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాలకు మాత్రమే దేవదాయశాఖ అధికారులు ఈవోలుగా ఉన్నారు. పెద్ద ఆలయాలకు రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌(ఆర్‌జేసీ) స్థాయి అధికారులు ఈవోలుగా ఉండాలి. ఆ స్థాయి ఉద్యోగులు లేనందున దేవదాయశాఖ, రెవెన్యూ శాఖకు చెందిన వారిని ఈవోలుగా నియమిస్తోంది. అయితే, దీనికి చట్టంలోనే అవకాశం కల్పించారు. 


ఖాళీలు భర్తీ చేయకుండా..

ఆర్‌జేసీ స్థాయి ఆలయాలు మినహా మరే ఇతర ఆలయానికీ ఇతర శాఖల అధికారులను ఈవోలుగా నియమించే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఆర్‌జేసీ స్థాయి తర్వాత ఆదాయాన్ని బట్టి డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 కేటగిరీల ఆలయాలున్నాయు. గ్రేడ్‌-1లో స్థాయిలో 45, గ్రేడ్‌-2లో 22, గ్రేడ్‌-3లో 206 ఈవో పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయకుండా వాటిని ఇతర శాఖలతో నడిపించాలని ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్పష్టమవుతోంది. ఇవి కాకుండా డీసీ, ఏసీ స్థాయిల్లోనూ చాలా ఖాళీలున్నాయి. వాటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా భారీ స్థాయిలో డిప్యుటేషన్ల విధానానికి వైసీపీ ప్రభుత్వం తెరతీస్తోంది. గత ప్రభుత్వం కనకదుర్గ ఆలయానికి, శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఐఏఎస్‌ అధికారులను ఈవోలుగా నియమించింది. కానీ, దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించి మళ్లీ సాధారణ పద్ధతికి తీసుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చిన్న ఆలయం నుంచి పెద్ద ఆలయం వరకు అన్నిట్లోనూ ఇతర శాఖల అధికారులకు స్వాగతం పలుకుతుండడం వివాదానికి దారితీస్తోంది.


పాలనలోనూ ఇతరులు

ఆలయాల పాలనతో పాటు శాఖలో ఇతరత్రా పాలనలోనూ ఇతర శాఖల ప్రమేయం పెరిగింది. రాష్ట్రంలో 4 జోన్లకు దేవదాయశాఖలో డిప్యూటీ కమిషనర్లు ఉంటే వీటిలో ఇప్పుడు 2 జోన్లకు రెవెన్యూ అధికారులే ఉన్నారు. సింహాచలం ఈవోగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ విశాఖపట్నం డీసీగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు డీసీగా ఇటీవలే మరో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించారు. ఆ జోన్లలో ఉన్న 6(బీ) ఆలయాలన్నీ వారి పరిధిలోనే ఉంటాయి. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు అన్ని స్థాయిల్లోనూ డిప్యుటేషన్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించనున్నారు. దేవదాయశాఖకు కొత్తగా వచ్చిన కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఇటీవల శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించగా, ఈ ప్రతిపాదనపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా డిప్యుటేషన్లకు అవకాశం ఇస్తే ఇబ్బందులు రెట్టింపు అవుతాయని, ఇది దేవదాయశాఖకు సరైన సంస్కరణ కాదని తేల్చి చెప్పారు.

Updated Date - 2021-10-14T09:11:21+05:30 IST