కొవిడ్‌ బాధితులకు... టెలీ మెడిసిన్‌ సేవలు

ABN , First Publish Date - 2021-05-02T08:32:22+05:30 IST

హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా వైద్యులతో సలహాలు, సూచనలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

కొవిడ్‌ బాధితులకు... టెలీ మెడిసిన్‌ సేవలు

హోం ఐసోలేషన్‌లోనివారికి సలహాలు, సూచనలు

24 గంటల్లో 443 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా

పెండింగ్‌ శాంపిల్స్‌ పూర్తి చేస్తాం: సింఘాల్‌


అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా వైద్యులతో సలహాలు, సూచనలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,898 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని చెప్పారు. వీరందరికి టెలీ మెడిసిన్‌ ద్వారా ఫోన్‌లో సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. సీసీసీ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయడంతోపాటు అక్కడే ఫలితాలు కూడా ఇవ్వనున్నామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకే అప్పగించినట్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ చికిత్సకు ఆస్పత్రులను జిల్లా కలెక్టర్లు గుర్తిస్తున్నారన్నారు. శుక్రవారం కంటే ఆక్సిజన్‌ సరఫరా పెంచామన్నారు. 24 గంటల్లో 443 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేశామని, మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఆపలేదని, పెండింగ్‌లో ఉన్న శాంపిళ్లను రెండు రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. 


ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ మరణించలేదు: ఆక్సిజన్‌ కొరత వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలువురు మరణించినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని సింఘాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘అనంతపురం సర్వజన ఆస్పత్రిలో కరోనావల్ల కొన్ని మరణాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మరికొన్ని సంభవించాయి. అనంతపురం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా విషయమై అణువణువూ తనిఖీ చేశాం. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నిల్వలు ఉంచుతున్నాం. కర్నూలు కేఎస్‌ కేర్‌ ప్రైవేటు ఆస్పత్రిలో సరిపడా మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయి. కొవిడ్‌, ఇతరత్రా కారణాలతో అక్కడ కొందరు చనిపోయారు’’ అని తెలిపారు. 

Updated Date - 2021-05-02T08:32:22+05:30 IST