జెన్కో నష్టాలకు తెలంగాణే కారణం!

ABN , First Publish Date - 2021-12-31T08:30:12+05:30 IST

జెన్కో నష్టాలకు తెలంగాణే కారణం!

జెన్కో నష్టాలకు తెలంగాణే కారణం!

కొత్త ప్లాంట్ల స్థాపనకు అదనంగా 12,830 కోట్ల భారం

జెన్‌కో నుంచి 6 వేల కోట్లు తీసుకోలేదు

రాష్ట్ర ఇంధన శాఖ వివరణ

‘అప్పుల్లోకి నెట్టి అమ్మకానికి’ కథనానికి స్పందన


అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జెన్కో నష్టాలకు తెలంగాణ నుంచి రావలసిన వేల కోట్ల బకాయిలు రాకపోవడమే కారణమని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. అలాగే జెన్కో, పీడీసీఎల్‌ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులకు చేస్తున్న అధిక వ్యయభారం కూడా ఓ కారణమని వెల్లడించింది. గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘అప్పుల్లోకి నెట్టి అమ్మకానికి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ఇంధన శాఖ వివరణ ఇచ్చింది. 2015 నుంచి 2021 వరకూ విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాలన్నిటికీ ప్రభుత్వం చెల్లింపులు జరిపిందని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ఆదేశాల మేరకు సరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.6,283.68 కోట్లను చెల్లించడం లేదని వెల్లడించింది. జెన్కో, ఏపీపీడీసీఎల్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.19,421 కోట్లు కాగా.. రూ.32,251 కోట్లు ఖర్చుచేశారని.. అదనంగా రూ.12,830 కోట్ల భారం పడిందని వివరించింది. జెన్కోకు 2015 నుంచి 2021 వరకూ నెలవారీగా నిధులు విడుదల చేస్తున్నామని.. ఆ సంస్థ నుంచి రూ.6,000 కోట్ల రుణం తీసుకోలేదని తెలిపింది. ఏపీపీడీసీఎల్‌ నష్టాలకు తెలంగాణ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Updated Date - 2021-12-31T08:30:12+05:30 IST