దేశరక్షణ వ్యవస్థలో సాంకేతిక విద్య కీలకం

ABN , First Publish Date - 2021-12-19T09:13:18+05:30 IST

దేశరక్షణ వ్యవస్థలో సాంకేతిక విద్య కీలకం

దేశరక్షణ వ్యవస్థలో సాంకేతిక విద్య కీలకం

ప్రతి విద్యార్థి కొత్త ప్రాజెక్టు ఆవిష్కరణకు కృషి చేయాలి

‘అనంత‘ జేఎన్‌టీయూ వజ్రోత్సవాల్లో డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీ్‌షరెడ్డి

అనంతపురం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): దేశరక్షణ వ్యవస్థలో సాంకేతిక విద్య కీలకమని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన్‌ సతీ్‌షరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని జేఎన్‌టీయూ(ఏ) వజ్రోత్సవాలను వర్సిటీలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాలకు వర్సిటీ పూర్వ విద్యార్థి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీ్‌షరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వర్సిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ.. క్షిపణి ప్రయోగాల్లో ప్రపంచదేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందన్నారు. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ప్రయోగించిన అగ్ని ప్రైమ్‌ క్షిపణి విజయవంతమైన విషయాన్ని గుర్తుచేశారు. అగ్ని-3 కంటే ఈ క్షిపణి బరువు తక్కువని.. దీనిని ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చన్నారు. దేశంలోని ఏ మూల నుంచైనా అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం ఈ క్షిపణి ప్రత్యేకత అని చెప్పారు. క్షిపణి, ఆయుధాల తయారీలో ఇంజనీర్లదే ప్రధాన పాత్ర అన్నారు. వీటి వినియోగానికి కావాల్సిన మెకానికల్‌, ఇంజనీరింగ్‌ నమూనాలు నిర్దేశిత సమయంలో రూపొందించాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి నూతన ప్రాజెక్టుల ఆవిష్కరణలకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పీజీ ద్వారా డిఫెన్స్‌ కోర్సులను ప్రవేశ పెట్టాల్సిన అవసరముందని సతీష్‌ రెడ్డి సూచించారు. అందుకు క్వాలిటీ ఫ్యాకల్టీని డిఫెన్స్‌ ద్వారా సమకూరుస్తామన్నారు. అనంతరం సతీ్‌షరెడ్డిని జేఎన్‌టీయూ వీసీ రంగ జనార్దన, రెక్టార్‌ విజయకుమార్‌, రిజిస్ర్టార్‌ శశిధర్‌, కళాశాల ప్రన్సిపాల్‌ సుజాత, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఘనంగా సన్మానించారు.

Updated Date - 2021-12-19T09:13:18+05:30 IST