అదో దివాలా కంపెనీ!

ABN , First Publish Date - 2021-03-22T09:25:12+05:30 IST

దివాలా కంపెనీ ముసుగులో ఇసుక వ్యాపారంలో వేల కోట్ల రూపాయలు మింగేందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రమంతా ఇసుక

అదో దివాలా కంపెనీ!

3,500 కోట్ల నష్టాల్లో ఉంది!

రాంకీ, ఎథెనా సంస్థల డైరెక్టరే జేపీ పవర్‌లోనూ ఉన్నారు

వేల కోట్లు మింగేందుకు సిద్ధం.. టన్నుపై రూ.450 మోతకు రెడీ!

రాష్ట్రాన్ని ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చారు.. ఇక టోకుగా అమ్మేయడమే

ఈ సీఎంను హోల్‌సేల్‌ రెడ్డిగా పిలుస్తున్నారు: టీడీపీ నేత పట్టాభి

జేపీ పవర్‌ ముసుగులో జగన్‌రెడ్డి ఇసుక వ్యాపారం

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్‌


అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): దివాలా కంపెనీ ముసుగులో ఇసుక వ్యాపారంలో వేల కోట్ల రూపాయలు మింగేందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రమంతా ఇసుక వ్యాపారాన్ని కట్టబెట్టిన జేపీ పవర్‌ వెంచర్స్‌ దివాలా కంపెనీ అని, ముఖ్యమంత్రి గతంలో కొనుగోలు చేయాలనుకున్న కంపెనీలోని డైరెక్టరే ఇందులోనూ ఉన్నారని తెలిపింది. రాష్ట్రాన్ని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చిన జగన్‌రెడ్డికి.. ఏదైనా సరే హోల్‌సేల్‌గా దోచుకోవడమే ఇష్టమని, అందుకే దేశంలోని వ్యాపారులంతా ఆయన్ను హోల్‌సేల్‌ రెడ్డి అని పిలుస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఎద్దేవాచేశారు. ఆదివారం తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏడాదికి రూ.3,500 కోట్ల నష్టాలను చవిచూస్తున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ కంపెనీకి ఇసుక రీచ్‌లను అప్పగించడంలోని మతలబేంటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.


జగన్‌రెడ్డికి సన్నిహితుడైన వైసీపీ ఎంపీ, రాంకీ అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీలో, గతంలో జగన్‌ కొనాలనుకున్న ఎథెనా పవర్‌ లిమిటెడ్‌ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన పెద్దిబొట్ల గంగాధరశాస్ర్తి జేపీ పవర్‌ వెంచర్స్‌లో డైరక్టర్‌గా పనిచేశారు. గంగాధర శాస్ర్తిని అడ్డుపెట్టుకుని.. జగన్‌రెడ్డి జేపీ వెంచర్స్‌తో క్విడ్‌ ప్రొ కొ ఒప్పందం చేసుకున్నారని అర్థమవుతోంది. ఆ సంస్థ గత నాలుగైదేళ్లుగా పూర్తిగా నష్టాల్లోనే ఉందని.. 2016 నుంచి వందల, వేలకోట్ల వరకు నష్టాల ఊబిలోకి కూరుకుపోయినట్లు స్పష్టమవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్ల నష్టాన్ని ప్రకటించిన ఆ సంస్థ.. ఏ రకంగా 13 జిల్లాల్లోని ఇసుక రీచ్‌లను నిర్వహించగలదు? పైగా దానికి ఇసుక వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేదు. అలాంటి కంపెనీకి ఇసుక వ్యాపారం అప్పగించడానికి ప్రధాన కారణం క్విడ్‌ ప్రొ కొ. నీకెంత, నాకెంత అనే సిద్దాంతంలో భాగంగా నష్టాల్లో ఉన్న కంపెనీలను తెరపైకి తెచ్చి.. వాటి ముసుగులో రాష్ట్ర సంపద మింగేయడం జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యే కదా! ఆ సంస్థకు ఏడాదికి కనీసం రూ.2వేల కోట్ల ఆదాయం లేనిదే ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టగలదా? జేపీ వెంచర్స్‌ ముసుగులో జగన్‌రెడ్డే వేల కోట్లు దిగమింగేందుకు సిద్ధమయ్యారు. టన్ను ఇసుకకు రూ.450కు పైగా వసూలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ప్రజలు చైతన్యంతో తిరగబడకపోతే ఏదో ఒకరోజు జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా అమ్మడం ఖాయం’’ అని హెచ్చరించారు.

 

వారికి రాజప్రాసాదం గేట్లు బార్లా..!

హోల్‌సేల్‌ ప్రతిపాదనలతో వచ్చే వ్యాపారులకు తాడేపల్లి రాజప్రాసాదం గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పట్టాభి అన్నారు. ‘చిల్లరమల్లర వ్యాపారాలను పక్కనపెట్టిన జగన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక టోకు వ్యాపారం మొదలుపెట్టారు. మద్యం వ్యాపారం తీసుకుంటే.. రాష్ట్రంలో 3,500 మద్యం దుకాణాలకు హోల్‌సేల్‌ యజమాని ఆయనే. లిక్కర్‌ డాన్‌గా మారిపోయి సొంత బెవరేజెస్‌, డిస్టిలరీలతో తన సొంత బ్రాండ్లనే అమ్ముతున్నారు. తర్వాత సిమెంటు వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని.. సిండికేట్‌ ఏర్పాటుచేసి సిమెంటు ధరలను అమాంతం పెంచేశారు. తన సొంత కంపెనీ భారతీ సిమెంట్స్‌కు ఏరకంగా దోచిపెడుతున్నారో చూస్తున్నాం. మద్యం వ్యాపారాన్ని ఒక జేబులో.. సిమెంటు వ్యాపారాన్ని ఇంకో జేబులో పెట్టుకుని.. ఇప్పుడు ఇసుక వ్యాపారం ప్రారంభించారు. అందులో భాగంగానే జేపీ పవర్‌ వెంచర్స్‌కు ఇసుక రీచ్‌లన్నింటినీ కట్టబెట్టారు’ అని విరుచుకుపడ్డారు. 

 

బ్యాలెన్స్‌ షీటే నిదర్శనం.. 

‘రూ.3,500 కోట్ల రెవెన్యూ నష్టాల్లో ఉన్న జేపీ కంపెనీకి ఇసుక తవ్వకాలు ఇవ్వడం వెనక ఏ మర్మం ఉంది? ఇది మరో క్విడ్‌ ప్రో కొ కాదా’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్విటర్‌లో ప్రశ్నించారు. ఆ కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పేందుకు సదరు సంస్థ బ్యాలన్స్‌ షీటే నిదర్శనమన్నారు. ఆ బ్యాలెన్స్‌ షీట్‌ను కూడా పోస్టు చేశారు.

Updated Date - 2021-03-22T09:25:12+05:30 IST