ఆంధ్రపై సవతితల్లి ప్రేమ!

ABN , First Publish Date - 2021-03-24T09:32:36+05:30 IST

ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమను ఎందుకు కనబరుస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిలదీశారు. మంగళవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రపై సవతితల్లి ప్రేమ!

గుజరాత్‌ సంస్థలనే పునరుద్ధరిస్తారా?

జీఎస్‌పీసీని ఓఎన్‌జీసీకి అంటగట్టారు.. విశాఖ ఉక్కు సంగతేంటి?

ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటున్నారు

ఒకే దేశం-ఒకే న్యాయం కూడా ఉండాలి.. ఉక్కు ప్రైవేటీకరణ మానుకోవాలి

వాజపేయి లేని లోటు కనిపిస్తోంది.. మోదీ కూడా ఆయన బాటలో నడవాలి

లోక్‌సభలో రామ్మోహన్‌నాయుడు ఫైర్‌


న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమను ఎందుకు కనబరుస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిలదీశారు. మంగళవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘పునరుద్ధరించగలిగిన ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరిస్తామని ఈ నెల 16వ తేదీన సభలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటించారు. కానీ అది ఎక్కడ వర్తిస్తుంది..? కేవలం గుజరాత్‌లో మాత్రమే. నష్టాల్లో ఉన్న గుజరాత్‌ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎ్‌సపీసీ)ని ఓఎన్‌జీసీకి అంటగట్టారు. మరి విశాఖ ఉక్కు పరిశ్రమ సంగతేంటి..? ఎందుకీ సవతితల్లి ప్రేమ..? ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు వంటివి మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఒకే దేశం-ఒకే న్యాయం ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాను. అటల్‌ బిహారీ వాజపేయి లేనిలోటు స్పష్టం కనిపిస్తోంది. ఆయన హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు, టీడీపీ నేత ఎర్రన్నాయుడు నేతృత్వంలో వచ్చిన కార్మిక సంఘాలు, నాయకుల వాదనలు విని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఈక్విటీకి ప్రకటించారు. దాంతో ఆ పరిశ్రమ రుణాల నుంచి బయటపడింది.


వాజపేయి బాటలోనే ఇప్పటి ప్రధాని మోదీ కూడా నడిచి ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల ఉక్కు నినాదంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల పోరాట ఫలితంగా ఈ పరిశ్రమ ఏర్పడిందని గుర్తుచేశారు. పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, 22 వేల మంది రైతులు ఈ పరిశ్రమకు భూములు ఇచ్చారని, అలా తెలుగు ప్రజల త్యాగాల పునాదులపై ఈ పరిశ్రమ ఏర్పడిందని వివరించారు. నష్టాల కారణంగా ప్రైవేటీకరణ చేస్తున్నామనడం సరికాదన్నారు. 2000-15 మధ్య కాలంలో ఈ పరిశ్రమ రూ.1.4 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించిందని, పన్ను చెల్లింపు తర్వాత రూ.12,600 కోట్ల లాభాలు నమోదు చేసిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. రికార్డు స్థాయిలో ఈ సంస్థ 1.3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఎగుమతి చేసిందన్నారు. కరోనా తీవ్రం గా ఉన్న సమయంలోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని, నిరుడు డిసెంబరులో రూ. 212 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ. 134 కోట్లు, ఫిబ్రవరిలో 165 కోట్లు ఆర్జించిందని, ఈ నెల రూ. 300 కోట్లకుపైగా లాభాలు వచ్చే అంచనాలు ఉన్నాయని తెలిపారు.


ఈ పరిశ్రమ ఎంతో ఇచ్చింది..

విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు కేంద్రం దీనిపై రూ.4,900  కోట్లు వెచ్చించిందని, తర్వాత రీస్ట్రక్చరింగ్‌పై రూ.1300 కోట్లు ఖర్చు చేసిందని, మొత్తం రూ.6,200 కోట్లు ఖర్చు చేస్తే... ఈ పరిశ్రమ రూ. 43 వేల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో, డివిడెండ్ల రూపంలో చెల్లించిందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. ‘దీనికి కేప్టిప్‌ గనులను కేటాయించాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్‌ ఉంది. ఇతర సంస్థలకు కేప్టివ్‌ గనులు ఉండడం వల్ల రూ. 1500కే టన్ను ఐరన్‌ ఓర్‌ లభిస్తోంది. కానీ విశాఖ ఉక్కుకు సొంత గనులు లేనందు వల్ల టన్ను ఐరన్‌ ఓర్‌పై రూ.7 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం టాటా స్టీల్స్‌ కంపెనీలకు 8 శాతం వడ్డీకే రుణాలు లభిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ పరిశ్రమకు 14 శాతం వడ్డీని వసూలు చేయడం ఏంటి? దీని వల్ల వడ్డీ చెల్లింపులకే రూ.1,500 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.


సెయిల్‌, విశాఖ ఉక్కును  విలీనం చేయాలన్న ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. దానిని కూడా కేంద్రం పరిశీలించడం లేదు. 82 శాతం ఐరన్‌ ఓర్‌ ఎగుమతులు చైనాకు వెళ్తున్నాయి. దేశంలోనే సమర్థమైన ప్రభుత్వ ఉక్కు పరిశ్రమలు ఉన్నప్పుడు ఐరన్‌ ఓర్‌ను వాటికి ఎందుకు ఇవ్వడం లేదు’ అని నిలదీశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్‌, విద్యా సంస్థలు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల వంటి విభజన హామీలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని నెరవేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

Updated Date - 2021-03-24T09:32:36+05:30 IST