పట్టాభి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ABN , First Publish Date - 2021-10-22T02:42:21+05:30 IST
పట్టాభి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

విజయవాడ: టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే ఆయన మరింత బెదిరింపులు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పట్టాభి వ్యాఖ్యల ద్వారా ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని తెలిపారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే రాజకీయ బలంతో ఫిర్యాదుదారుడిని ఇతర సాక్షులను బెదిరించి ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. పట్టాభి రాజకీయ మైలేజీని పొందాలనే ఉద్దేశ్యంతో నేరపూరిత చర్యలను కొనసాగించవచ్చన్నారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని తెలిపారు.
‘‘కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శాంతి ఉల్లంఘనను ప్రేరేపించడానికి పట్టాభి సమగ్రమైన, భయపెట్టే భాషను మరింతగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో పట్టాభి పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పట్టాభి కుట్రను మరింత పరిశోధించాల్సిన అవసరం ఉంది. పట్టాభిని అరెస్టు చేయకపోతే, కొన్ని రాజకీయ పార్టీల నుంచి అతని మాటలకు మద్దతు లభించిన దృష్ట్యా నిరసనల సమయంలో మరోసారి అతని వ్యాఖ్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. పట్టాభి నేర స్వభావం కలిగిన వ్యక్తి. ఇప్పటికే నాలుగు కేసుల్లో పట్టాభి నిందితుడు. పట్టాభి ప్రకటన కారణంగా చాలా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసే స్థాయికి వెళ్లింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పట్టాభిని అరెస్టు చేయడం తప్ప వేరే మార్గం లేదు.’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.