ఇసుక పేరుతో 10 వేల కోట్లు స్వాహా
ABN , First Publish Date - 2021-03-24T09:51:34+05:30 IST
ఇసుక పేరు తో రూ.10 వేల కోట్లు తినేయాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్లాన్ చేసి.. జేపీ వెంచర్స్ అనే కంపెనీని తెరపైకి తెచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. మంగళవారం ఆయన

ఒకే కంపెనీకి రాష్ట్రం రాసిచ్చేసిన జగన్
బాగా చేస్తే ధర ఎందుకు పెరిగింది?
టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఇసుక పేరు తో రూ.10 వేల కోట్లు తినేయాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్లాన్ చేసి.. జేపీ వెంచర్స్ అనే కంపెనీని తెరపైకి తెచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎవరూ లేకుండా ఇసుకపై ఆదాయం అంతా తనే తినేయాలని జగన్ రెడ్డి పెద్ద ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే ఇసుక రీచ్‌లను తన బినామీ అయిన జేపీ వెంచర్స్‌కి ఇచ్చేశారు. టెండర్లలో ఆ కంపెనీ దక్కించుకున్నట్టు చూపిస్తున్నారు.
ఇసుక తవ్వకాల్లో ఏ అనుభవం లేని ఉత్తరాది కంపెనీ వచ్చి ఈ రాష్ట్రంలో ఇసుక తవ్వి అమ్మ డం నమ్మ శక్యమేనా? పైగా రూ. మూడున్నర వేల కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీ.. జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లు నామమాత్రపు ఆదాయానికి ఇంత దూరం వచ్చి, ఇంత పెట్టుబడి పెట్టి పని చేస్తుందా? తిమ్మిని బమ్మిని చేసి వందల కోట్ల ప్రభుత్వ ఖర్చుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. మీది అంత గొప్ప కార్యక్రమం అయితే టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు ఇసుక ధర మూడు నాలుగు రెట్లు ఎందుకు పెరిగింది? పెరిగిన ధర ఎవరి జేబుల్లోకి పోతోంది? వీటికి సమాధానం చెప్పాలి’’ అని పట్టాభి డిమాండ్ చేశారు.
న్యాయ సమీక్షకు ఎందుకు ఇవ్వలేదు?
కాగా, రూ.వంద కోట్లకు మించిన ప్రతి టెండర్‌ను న్యాయ సమీక్షకు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక టెండర్లను అదే సమీక్షకు ఎందుకు ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. న్యాయ సమీక్ష కోసం ప్రత్యేకంగా శివశంకర్‌రావు చైర్మన్‌గా కమిటీ కూడా ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు ఆ కమిటీని కాకెత్తుకెళ్లిందా అని ప్రశ్నించారు.
ఇసుక కాంట్రాక్టు రద్దు చేయండి: రామకృష్ణ
రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కోసం జేపీ పవర్ వెంచర్స్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ సీఎం జగన్ బినామీ కంపెనీ అనే ప్రచారం జరుగుతోందన్నారు. కేవలం రూ.54 కోట్ల లాభం కోసం జేపీ వెంచర్స్ కంపెనీ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు, రీచ్ నిర్వహణకు సిద్ధమైందని చెప్పడం హాస్యాస్పదమని రామకృష్ణ విమర్శించారు.
ఈ ప్రశ్నలకు బదులుందా?
ఈ సందర్భంగా ప్రభుత్వానికి పట్టాభి కొన్ని ప్రశ్నలు సంధించారు.
వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కంపెనీ రాంకీలో ఇప్పటికీ డైరెక్టర్‌గా ఉన్న గంగాధర శాస్త్రి గతంలో జేపీ గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఉండి ఇప్పుడు ఈ క్విడ్ ప్రో కో వ్యవహారాన్ని నడిపిన విషయం వాస్తవం అవునా కాదా?.
రూ.మూడున్నర వేల కోట్ల నష్టాల్లో ఉండి దివాలాకు సిద్ధంగా ఉన్న కంపెనీకి ఇసుక టెండర్లు కట్టబెట్టడం మీ లోపాయికారి ఒప్పందంలో భాగం కాదా?
చంద్రబాబు హయాంలో ‘ఉచిత ఇసుక’ విధానంలో రూ.1200కు ఒక ట్రాక్టర్ ఇసుక దొరికితే ఇప్పుడు అదే ఇసుక రూ.5 వేలకు పెరగడం ప్రజా ద్రోహం కాదా?
ప్రభుత్వం తరఫున మీరు గతంలో ఇచ్చిన ప్రకటనల్లో రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ఆ లెక్కన ఏడాదికి ఆరు కోట్ల టన్నుల ఇసుక లభ్యత ఉంటే ప్రైవేటు కంపెనీ ద్వారా ఏడాదికి రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు మాత్రమే జరుగుతాయని ఎలా చెబుతారు? మిగిలిన ఇసుక మీ ప్రైవేటు దందా కింద వెళ్లిపోతుందా?
ఒక టన్ను ఇసుక ధర రూ.475 చేయడంతోపాటు హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో అదనంగా రూ.150 వసూలు చేయాలని నిర్ణయించింది నిజం కాదా?
ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీఎండీసీ, ఎన్‌ఎండీసీలను కాదని ప్రైవేటు సంస్థలకు దీనిని కట్టబెట్టాలని నిర్ణయించడం మీ దోపిడీలో భాగం కాదా?
ఇసుక తవ్వకాల్లో ఎటువంటి అనుభవం లేని కెమికల్ కంపెనీ ట్రెడెంట్ కెంఫర్, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అనే వాటితో డమ్మీ టెండర్లు వేయించి చివరకు జేపీ వెంచర్స్‌కు టెండర్ కట్టబెట్టడం అవినీతి వ్యవహారాల్లో మీ నైపుణ్యానికి నిదర్శనం కాదా?
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని రోడ్లపై ఉద్యమాలు చేస్తూ ఇసుక తవ్వకాలను ఎలా ప్రైవేటుపరం చేస్తారు?