దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయండి

ABN , First Publish Date - 2021-08-10T08:54:17+05:30 IST

‘‘వైసీపీ నాయకులు, జగన్‌ మీడియా నాపై అసత్యపు ఆరోపణలు చేస్తోంది. దమ్ముంటే ఆ ఆరోపణలను రుజువు చేయాలి. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టు చేసింది నేనని నిరూపిస్తే రాజకీయాల...

దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయండి

  • లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి.. జగన్‌ మీడియాకు ‘బొల్లినేని’ సవాల్‌
  • సజ్జల, మంత్రి అనిల్‌ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపాటు

నెల్లూరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నాయకులు, జగన్‌ మీడియా నాపై అసత్యపు ఆరోపణలు చేస్తోంది. దమ్ముంటే ఆ ఆరోపణలను రుజువు చేయాలి. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టు చేసింది నేనని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. లేదంటే జగన్‌ మీడియా బహిరంగ క్షమాపణలు చెప్పాలి’’ అని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ కనీస జ్ఞానం లేకుండా, పులిచింతల పనులు ఎవరు చేశారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన కంపెనీ పేరు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు పనులు చేసిన కంపెనీ పేరు శ్రీనివాస ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అని తెలిపారు. ఆ కంపెనీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులదేనని వివరించారు. ఆ కంపెనీ యాజమాన్యానికి చెందిన కుటుంబంలోని ఓ వ్యక్తి ఇటీవల వైసీపీ తరఫున జడ్పీటీసీగా కూడా పోటీ చేశారని చెప్పారు. తాను రాష్ట్రంలో అసలు కాంట్రాక్టు పనులు చేయడం లేదని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్‌ మీడియా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరంగా పోరాడతానని బొల్లినేని హెచ్చరించారు. 

Updated Date - 2021-08-10T08:54:17+05:30 IST