టీడీపీ సమాంతర సభ

ABN , First Publish Date - 2021-05-20T08:49:27+05:30 IST

గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన తెలుగుదేశం శాసనసభాపక్షం...ప్రజా సమస్యలపై చర్చకు రెండు రోజులపాటు సమాంతర

టీడీపీ సమాంతర సభ

అసెంబ్లీ భేటీని బహిష్కరిస్తూ..

తీర్మానాలు చేసి స్పీకర్‌కు.. టీడీఎల్పీ నిర్ణయం

నేటి నుంచి 2 రోజుల పాటు నిర్వహణ

వర్చువల్‌గా సభలో జనగళం

‘బీఏసీ’లో ఎజెండా ఖరారు 


 అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన తెలుగుదేశం శాసనసభాపక్షం...ప్రజా సమస్యలపై చర్చకు రెండు రోజులపాటు సమాంతర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. సమాంతర బీఏసీ సమావేశాన్ని బుధవారం నిర్వహించి రెండు రోజుల చర్చనీయాంశాలను కూడా ఖరారు చేసింది. ఆ పార్టీ శాసనసభాపక్షం ఉప నేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయం  తెలిపారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం... సమాంతర అసెంబ్లీ సమావేశం గురువారం సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకూ...శుక్రవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీనిని నిర్వహిస్తారు.

 

తొలిరోజు..

‘‘‘బీఏసీ’లో తీసుకున్న నిర్ణయం ప్రకారం తొలి రోజు మా సమావేశంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి కరోనాపై చర్చించాలని నిర్ణయించాం. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజల ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎత్తిచూపుతాం. దీనిపై వాయిదా తీర్మానాన్ని కూడా అసెంబ్లీ స్పీకర్‌కు పంపిస్తున్నాం. పొరుగునున్న తమిళనాడు రాష్ట్రం ప్రతి కుటుంబానికి రూ. నాలుగు వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటువంటి ఆలోచనలు ఈ ముఖ్యమంత్రికి రావడం లేదు. కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆస్పత్రుల్లో ఏం జరుగుతోందో కూడా చూసే తీరిక ఈ ముఖ్యమంత్రికి లేదు. అందుకే తొలి రోజు కరోనాపై చర్చ పెట్టుకొన్నాం’’  అని నిమ్మల, శ్రీనివాసులు తెలిపారు. 


రెండోరోజు..

రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో.. పింఛన్లలో మోసం, వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పిన సీపీఎస్‌ రెండేళ్లయినా రద్దు చేయకపోవడం, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం, దిశ పోలీస్‌ స్టేషన్ల మాయ, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చిస్తారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని రుద్ది ప్రజలను వేధిస్తున్న తీరు, ఇసుక, మద్యం, మట్టి, భూముల సేకరణ పేరుతో వేల కోట్ల రూపాయలు జగన్‌ సర్కారు దోచుకొంటున్న తీరును కూడా చర్చించాలని నిర్ణయించామని చెప్పారు.


అరకుకు.. చెరుకుకు తేడా తెలియని సీఎం

అరకుకు... చెరుకుకు తేడా తెలియని ముఖ్యమంత్రి.. హెక్టారుకు...ఎకరానికి తేడా తెలియని వ్యవసాయ మంత్రి కలిసి రైతులను ఉద్దరిస్తామని కబుర్లు చెబుతున్నారని నిమ్మల ఎద్దేవా చేశారు. ‘‘కౌలు రైతులు ధాన్యం పండించి అమ్మితే ఆ డబ్బులు భూ యజమాని ఖాతాలో వేస్తామని చెబుతున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. 16 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఏభై వేల మందికి కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. సీఎం చెబితేనే అసెంబ్లీలో తమకు స్పీకర్‌ మైక్‌ ఇస్తారని, అసెంబ్లీని వైసీపీ కార్యాలయంలా మార్చేశారని ఆరోపించారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 15వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మరణాల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని శ్రీనివాసులు విమర్శించారు.

Updated Date - 2021-05-20T08:49:27+05:30 IST