శివశ్రీ సోదరుడి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-08-25T09:14:03+05:30 IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసం వద్ద కరకట్టపై ఉన్న ఇళ్ల తొలగింపు సందర్భంగా ఆందోళన చేసిన వలంటీర్‌ శివశ్రీ సోదరుడు వడిగెన అనిల్‌కుమార్‌(41) అనుమానాస్పద స్థితిలో

శివశ్రీ సోదరుడి అనుమానాస్పద మృతి

రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన అనిల్‌ 

స్నేహితులతో కలసి దర్శి వచ్చినట్లు అన్నకు ఫోన్‌ 

ఉన్నట్టుండి కిందపడి చనిపోయాడన్న తోటి ఆటో డ్రైవర్‌ 


మంగళగిరి, ఆగస్టు 24: గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసం వద్ద కరకట్టపై ఉన్న ఇళ్ల తొలగింపు సందర్భంగా ఆందోళన చేసిన వలంటీర్‌ శివశ్రీ సోదరుడు వడిగెన అనిల్‌కుమార్‌(41) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రెండు రోజుల క్రితం కుంచనపల్లిలోని ఇంటినుంచి వెళ్లిన అనిల్‌కుమార్‌ మంగళవారం రాత్రి విగతజీవుడై ఇంటికి చేరాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఆటోడ్రైవర్‌గా జీవనం గడుపుతున్న అనిల్‌కుమార్‌ రెండు రోజుల క్రితం ఉన్నట్లుండి అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం తన అన్న ప్రతా్‌పకు ఫోనుచేసి తాను స్నేహితులతో కలిసి ప్రకాశం జిల్లాలోని దర్శి వచ్చానని, రేపు ఉదయం ఇంటికి వస్తానని చెప్పినట్టు కుటుంబీకులు తెలిపారు. రాత్రి 8గంటల సమయంలో అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని ఆటోడ్రైవర్‌ చిన్నా ఇంటికి తీసుకువచ్చాడు. గుంటూరుకు సమీపంలోని తక్కెళ్లపాడు వద్ద ఉన్నపళంగా కిందపడి మృతి చెందినట్టు చెప్పి వెళ్లిపోయాడని కుటుంబీకులు పేర్కొన్నారు.


మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇల్లు కూల్చివేత సమయంలో ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా శివశ్రీ పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని హైదరాబాద్‌ వెళ్లి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కూడా కలిసింది. ఇప్పుడు ఆమె సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందడంపై శివశ్రీ, కుటుంబీకులు పలు అనుమానాలు వెలిబుచ్చారు. దీనిపై తాడేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

Updated Date - 2021-08-25T09:14:03+05:30 IST