ముగ్గురు పీఆర్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-21T08:26:27+05:30 IST

పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్‌ అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 16న నాడు-నేడులో భాగంగా ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ

ముగ్గురు పీఆర్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

తూర్పుగోదావరిలో ఈఈ, డీఈ, జేఈపై వేటు

పాఠశాల పనులపై పర్యవేక్షణా లోపమే కారణం

వైసీపీ నేతలే పనులు చేశారన్న అధికారులు 

సీఎం ప్రారంభించిన చోటే అక్రమాలు 

అమలాపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్‌ అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 16న నాడు-నేడులో భాగంగా ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు లేవంటూ వారిని బాధ్యులుగా పేర్కొంది. శుక్రవారం అమలాపురం పంచాయతీరాజ్‌ ఈఈ కె.చంటిబాబు, పి.గన్నవరం పంచాయతీరాజ్‌ డీఈఈ చంద్రశేఖరెడ్డి, మండల ఇంజనీరింగ్‌ అఽధికారి ఆనంద్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. హైస్కూలు నిర్మాణ పనుల్లో నాసిరకం మెటీరియల్‌ వినియోగించడంతో పాటు పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టు ఈ నెల 11న విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ పర్యటనలో బహిర్గతమైంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణా లోపాన్ని గుర్తించి, వారిపై మండిపడ్డారు. కొన్ని నిర్మాణాలను తొలగించి పునర్నిర్మించాలని, నాసిరకం మెటీరియల్‌ను పూర్తిగా తొలగించి నాణ్యమైన మెటీరియల్‌ను వినియోగించాలని ఆదేశించారు. పనుల్లో లోపాలపై ఈ నెల 12న ‘సీఎం జగన్‌ ప్రారంభించే నాడు-నేడు పనులపై అసంతృప్తి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. హైస్కూలులో నాడు-నేడు పనులు అయిందనిపించి సీఎం జగన్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే నాడు-నేడు పాఠశాల పనుల్లో తమ ప్రమేయం ఏమీ లేదని అంతా వైసీపీ నాయకులే చేసుకుంటున్నారని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు, విద్యా కమిటీ చైర్మన్‌, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నాణ్యతకు తిలోదకాలిచ్చి పనులను ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారని ఇంజనీరింగ్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పర్యవేక్షణ లోపం ఉందనే కారణంతో అధికారులపై వేటు పడడం చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రారంభించిన పాఠశాల పనుల్లోనే అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనడానికి ఇంజనీరింగ్‌ అధికారుల సస్పెన్షనే ఉదాహరణ. ఇంజనీరింగ్‌ అధికారుల సస్పెన్షన్‌ను పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బి.రవీంద్ర ధ్రువీకరించారు. 

Updated Date - 2021-08-21T08:26:27+05:30 IST