అడుగు పెట్టకముందే అడ్డంకులు

ABN , First Publish Date - 2021-12-07T07:42:51+05:30 IST

చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టకముందే అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు మొదలయ్యాయి...

అడుగు పెట్టకముందే  అడ్డంకులు

 ముగింపుసభకు అనుమతి లేదన్న 

 తిరుపతి పోలీసులు

తిరుపతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టకముందే అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు మొదలయ్యాయి. తిరుపతిలో 17న నిర్వహించ తలపెట్టిన ముగింపు సభకు అనుమతి లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతిచ్చింది పాదయాత్రకు మాత్రమేనని చెబుతూ, అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు తిరుపతి అర్బన్‌ పోలీసులు సమాధానం పంపారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా సరిహద్దులు దాటి చిత్తూరు జిల్లాకు పాదయాత్ర చేరుకోనుంది. తొలిరోజు శ్రీకాళహస్తి మండలం ఎంపేడు వద్ద రైతులు భోజనం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డుపక్కన ఖాళీ భూమిని చదును చేశారు. అయితే భూమిని గుర్తుతెలియని వ్యక్తులు దున్నించేశారు. కాగా.. మూడు రాజధానులకు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మద్దతు ఉంటుందని, ఆ నేపథ్యంలో బహిరంగసభలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, నినాదాలు చేస్తే పరిస్థితి ఏమిటని కూడా పోలీసులు ప్రశ్నించారు. తిరుపతిలో ట్రాఫిక్‌  సమస్యలు తలెత్తుతాయని అభ్యంతరం వ్యక్తం చేశా రు. శ్రీవారి దర్శనాలకు అనుమతి లేకుండా కొండమీదకు అనుమతించరని చెప్పారు. ఇదిలా ఉండగా ఎస్వీ యూనివర్శిటీ స్టేడియంలో ముగింపు సభకు అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు వర్శిటీ వీసీకి లేఖ రాసినా దానిపై ఇంతవరకు సమాధానం లేదని సమాచారం. రైతుల కోసం శ్రీవారి దర్శనార్థమై రూ.300 టికెట్లు కేటాయించాలని ఈవోకు రాసిన లేఖపైనా ఇంతవరకూ సమాధానం లేదని తెలిసింది. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా అమరావతి రైతులు 8వ తేదీ రాత్రికి శ్రీకాళహస్తి పట్టణ శివార్లకు చేరుకుంటారు. ఇక్కడే మూడు రోజులు ఉంటారు. అయితే, దీనిపైనా శ్రీకాళహస్తి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-07T07:42:51+05:30 IST