రమణ దీక్షితులు పునర్నియామకాన్ని ఆపండి

ABN , First Publish Date - 2021-05-05T08:52:28+05:30 IST

పదవీ విరమణ చేసిన రమణ దీక్షితులిని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా టీటీడీ పునర్నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది

రమణ దీక్షితులు పునర్నియామకాన్ని ఆపండి

హైకోర్టులో వేణుగోపాల దీక్షితులి పిటిషన్‌


అమరావతి, మే4 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ చేసిన రమణ దీక్షితులిని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా టీటీడీ పునర్నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పదవీ విరమణ చేసిన ప్రధాన అర్చకులు/అర్చకులను తిరిగి అదే స్థానంలో నియమించేందుకు ఏప్రిల్‌ 2న టీటీడీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను వ్యతిరేకిస్తూ.. గొల్లపల్లి వంశానికి చెందిన ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు ఈ పిటిషన్‌ వేశారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, రమణ దీక్షితులిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. శ్రీవారి దేవస్థాన ప్రధాన అర్చకుడిగా వేణుగోపాల దీక్షితులి విధుల్లో దేవదాయ శాఖ, టీటీడీ కలుగజేసుకోకుండా నిలువరించాలని కోరారు. పదవీ విరమణ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని.. రమణదీక్షితులు ఇప్పటికే పదవీవిరమణ చేశారని తెలిపారు. పదవీ విరమణ చేసినవారిని అదే స్థానంలో నియమించేందుకు టీటీడీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలుపుదల చేయాలని కోరారు. ఈ వ్యాజ్యం మరోసారి బుధవారం విచారణకు రానుంది. ఇంకోవైపు.. పదవీ విరమణ చేసిన ఏఎస్‌ నరసింహ దీక్షితులిని ప్రధాన అర్చకుడిగా తిరిగి విధుల్లోకి తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ తిరుపతమ్మ వంఽశం నుంచి గోవిందరాజ దీక్షితులు మరో వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - 2021-05-05T08:52:28+05:30 IST