ఏపీఎండీసీలో తిరుగుబాట!

ABN , First Publish Date - 2021-03-24T09:52:51+05:30 IST

‘ఏపీఎండీసీలో ఉన్నది ప్రభుత్వ సిబ్బంది కాదు.. ప్రైవేటువారే. 2వేల మందిని ఇసుక కోసం తాత్కాలికంగా తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు వారితో పనిలేదు. వారు మా ఉద్యోగులు కాదు’ అని రాష్ట్ర భూగర్భ

ఏపీఎండీసీలో తిరుగుబాట!

ముఖ్య కార్యదర్శి ద్వివేది వ్యాఖ్యలతో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిలో కాక

రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు సమాయత్తం


తెనాలి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీఎండీసీలో ఉన్నది ప్రభుత్వ సిబ్బంది కాదు.. ప్రైవేటువారే. 2వేల మందిని ఇసుక కోసం తాత్కాలికంగా తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు వారితో పనిలేదు. వారు మా ఉద్యోగులు కాదు’ అని రాష్ట్ర భూగర్భ వనరులు, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎండీసీ ఉద్యోగుల్లో తిరుగుబాటుకు కారణమవుతున్నాయి. వైసీపీ సర్కారు వచ్చాక కొత్త ఇసుక పాలసీ అంటూ.. అక్రమాలు జరగకుండా చూసేందుకు కొంతమంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో తీసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద  2,100 మందిని నియమించారు. అయితే ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌కు అప్పగించడం, అవినీతి ఆరోపణలు రావడంతో ద్వివేది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ సమర్థించుకున్నారు. ఇదే సమయంలో ఏపీఎండీసీ సిబ్బంది పరిస్థితి ఏమిటనేదానిపై చేసిన పై వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.  ‘మాలో చాలామంది వైసీపీ అభిమానులే.


చివరకు మమ్ముల్నే మోసం చేసి, మేమే ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ద్వివేది వ్యాఖ్యలు చేశారు’ అని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు తమకిచ్చిన వేతనాలు.. తామిచ్చిన మామూళ్లంత కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొంతమంది ఏపీఎండీసీ సిబ్బంది విధులకు వెళ్లకుండా నిరసన తెలిపారు. దీంతో ఇసుక కోసం వచ్చిన లారీలు కృష్ణా నది కుడి కరకట్టపై కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కాగా.. గుంటూరు జిల్లాకు చెందిన కొన్ని రీచ్‌ల సిబ్బంది మున్నంగిలో సమావేశమైన 2రోజుల్లో నేరుగా ముఖ్యమంత్రికే తమ గోడు వినిపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-03-24T09:52:51+05:30 IST