10మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణం

ABN , First Publish Date - 2021-12-09T08:35:30+05:30 IST

స్థానిక సంస్థలకు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ

10మంది  వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణం

  • అసెంబ్లీ ప్రాంగణంలో ఎనిమిదిమంది, చైర్మన్‌ చాంబర్‌లో ఇద్దరితో ప్రమాణస్వీకారం
  • 17న ప్రమాణం చేయనున్న ఉదయభాస్కర్‌
  • మండలిలో 32కి పెరిగిన అధికారపక్షం బలం


అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో 11 మంది వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా మండలికి ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది సభ్యులతో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు బుధవారం  ప్రమాణం చేయించారు. ప్రమాణం తీసుకున్న వారిలో ఇందుకూరి రఘురాజు, వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్‌,తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, తూమాటి మాధవరావు, కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌, వై శివరామిరెడ్డి ఉన్నారు.


అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన  కార్యక్రమంలో తొలుత ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేయగా, తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌ ఆలస్యంగా వచ్చారు. దీంతో శాసనమండలిలోని తన చాంబరులో చైర్మన్‌ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. మరో సభ్యుడు అనంత సత్య ఉదయభాస్కర్‌ 17వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది. 58మంది సభ్యులు కలిగిన మండలిలో తాజాగా పెరిగిన సభ్యులతో అధికార పక్షం బలం 32కు చేరింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, శంకరనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ... సీఎం చేయాలనుకున్న అనేక కార్యక్రమాలను మండలి అడ్డుకుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇకముందు ఎవరూ అడ్డుకోలేరు అని ధీమా వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-12-09T08:35:30+05:30 IST