సర్కారుకు తోడుగా నిలవండి

ABN , First Publish Date - 2021-12-08T08:30:31+05:30 IST

సర్కారుకు తోడుగా నిలవండి

సర్కారుకు తోడుగా నిలవండి

ఆర్బీకేలు, సచివాలయాల్లో ఏటీఎంలు పెట్టాలి 

ఆర్థిక కార్యకలాపాలకు ఇవి వేదికగా మారాలి

బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం జగన్‌


అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బ్యాంకులు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఏటీఎం సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఇవి వేదికగా మారాలి. దీనివల్ల గ్రామంలోనే ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు లభిస్తాయి. గ్రామీణ వ్యవస్థలో గొప్ప మార్పునకు ఇది దారి తీస్తుంది. ఆ దిశగా బ్యాంకులు ఆలోచన చేయాలి’’ అని సూచించారు. అర్హులైన రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఆర్బీకే స్థాయిలో బ్యాంకులు వెంటనే జారీ చేయాలని కోరారు. కౌలురైతులకు కూడా రుణాలు అందాలని, ఈ-క్రాప్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపడితే రుణాల జాబితా నుంచి అనర్హులు తొలగిపోతారని చెప్పారు. బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్న 4,240 ఆర్బీకేల్లో కరస్పాండెంట్లను నియమించి, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380కోట్లు కాగా, తొలి 6నెలల్లో రూ.1,71,520కోట్లు(60.53శాతం) రుణాలు మంజూరు చేశాయని చెప్పారు. ప్రాధాన్య రంగానికి రుణ లక్ష్యం రూ.2,13,560కోట్లుకు గాను రూ.1,00,990 కోట్లు (47.29ు) పంపిణీ చేశాయన్నారు. అయితే వ్యవసాయానికి స్వల్పకాలిక పంట రుణాల్లో తొలి 6నెలల్లో 51.57ు రుణాలివ్వగా, దీర్ఘకాలిక రుణాల్లో మౌలిక వసతులకు 35.33శాతం, వ్యవసాయ అనుబంధ రంగాలకు 37.31శాతం మాత్రమే ఇవ్వడం నిరాశాజనకంగా ఉందన్నారు. వీటిపై బ్యాంకులు దృష్టి పెట్టాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణకు 9.08శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడానికి 4.52ు, చేపల పెంపకానికి 14.84ు మాత్రమే ఇవ్వడం ద్వారా రుణ లక్ష్యంలో 47.50ు మాత్రమే పంపిణీ చేశారన్నారు. నికర రుణ మొత్తంలో సాగురంగానికి గతేడాది 42.50ు ఇవ్వగా, ఈ ఏడాది 38.48ునికి తగ్గాయన్నారు. కొవిడ్‌తో తలెత్తిన కీలక సమస్యల పరిష్కార దిశగా బ్యాంకులు దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ కోరారు. 


స్థలాల తనఖాతో మహిళలకు రుణాలు 

ఇళ్ల స్థలాలను మహిళల పేరుతో పక్కాగా రిజిస్టర్‌ చేసి ఇచ్చినందున వాటిని తనఖా పెట్టుకుని ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని బ్యాంకర్లను సీఎం కోరారు. 3ు వడ్డీనే వసూలు చేయాలని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ‘‘30లక్షలపైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా, కేంద్రం పీఎంఏవై ద్వారా తొలిదశలో 15.60లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.80లక్షలు ఇస్తోంది. లబ్ధిదారులకు మరో రూ.35వేలు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ఎంఎ్‌సఎంఈ రంగానికి రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ వన్‌టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌(ఓటీఆర్‌)ను ప్రకటించి చిరు వ్యాపారులకు అండగా నిలబడ్డామని చెప్పారు. అయితే ఈ ప్రక్రియతో ఆశించిన స్థాయిలో ప్రయోజనం రాలేదని, 8.3లక్షల రుణ ఖాతాలుంటే, కేవలం 1.78 లక్షల ఖాతాలు(22ు)మాత్రమే పునర్‌వ్యవస్థీకరణ అయ్యాయని చెప్పారు. జగనన్న తోడు పథకంలో వచ్చే దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలని కోరారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక బోధనాస్పత్రి, ఒక నర్సింగ్‌ కాలేజీ పెడుతున్నామని, వాటికి రూ.12,243కోట్లు అవసరం కాగా, నాబార్డు కొంత రుణమిస్తోందన్నారు. ఇంకా రూ.9వేల కోట్లు కావాలన్నారు. విద్యారంగంలో నాడు-నేడు కింద 57వేల స్కూళ్లను సమూలంగా మారుస్తున్నందున ఈ ప్రక్రియలో బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని జగన్‌ కోరారు. కొవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21లో రూ.14వేల కోట్లు తగ్గిందని, మొత్తంగా రూ.30వేల కోట్ల భారం పడిందని ప్రకటించారు. బ్యాంకింగ్‌ రంగం సహకారంతోనే ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు రాజ్‌కిరణ్‌ రాయ్‌ మాట్లాడుతూ బ్యాంకులకు తనఖా పెట్టిన ఆస్తుల రిజిస్ర్టేషన్‌ సమస్య అపరిష్కృతంగా ఉందని, వానిపై దృష్టి పెట్టాలని కోరారు.

Updated Date - 2021-12-08T08:30:31+05:30 IST