తెలంగాణవి అడ్డగోలు వాదనలు

ABN , First Publish Date - 2021-10-29T09:21:00+05:30 IST

తెలంగాణవి అడ్డగోలు వాదనలు

తెలంగాణవి అడ్డగోలు వాదనలు

సీఎం జగన్‌ మౌనంతో రాష్ర్టానికి నష్టం

కృష్ణా డెల్టా ఆయకట్టుకు తీరని అన్యాయం

ఆయకట్టులో ఎకరా తగ్గినా ఊరుకునేది లేదు

రాష్ట్ర సాగు నీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక

రైతులంతా ఉద్యమిస్తామని ప్రకటన


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ తీరుతో రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మౌనం దాల్చడంతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు తీరని నష్టం జరుగుతోందని సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టును 1.30 లక్షల ఎకరాల నుంచి 3.67 లక్షల ఎకరాలకు పెంచారంటూ కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ ఫిర్యాదు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని గురువారం ఓ ప్రకటనలో నిలదీశారు. రాష్ట్రం ఆయకట్టు 3.67 లక్షల ఎకరాలలో ఒక్క ఎకరా తగ్గినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. 1952లో నందికొండ వాగు ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్‌ రాష్ట్రం రూపొందించిందని, దానిని రాష్ట్ర అవతరణ (1956) తర్వాత నాగార్జునసాగర్‌ నివేదికగా తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు పేర్కొనడంపై కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ అడ్డగోలు వాదనలు చేస్తుంటే రాష్ట్ర జల వనరులశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. దీనిపై కృష్ణా డెల్టా రైతాంగం ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-10-29T09:21:00+05:30 IST