నైరుతి మందగమనం

ABN , First Publish Date - 2021-06-21T09:02:54+05:30 IST

నైరుతి రుతుపవనాలు మందగించాయి. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.

నైరుతి మందగమనం

అమరావతి/విశాఖపట్నం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు మందగించాయి. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పశ్చిమ, నైరుతి గాలులు బలంగా వీస్తున్న కారణంగా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలు కురవడం లేదు. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో పొడివాతావరణం కొనసాగుతున్నది. వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ నెల 1 నుంచి 20 వరకు రాష్ట్రంలో 70.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 59.6 మిల్లీమీటర్లు నమోదైంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 67.7ు వర్షపాతం లోటు ఉండగా, ప్రకాశం, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 30-48ు లోటు ఏర్పడింది. కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, కడప, అనంతపురంలో వర్షాలు ఆశాజనకంగా పడ్డాయి. రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై అంతగా చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-06-21T09:02:54+05:30 IST