అనంతలో సోనూసూద్‌ సేవలు

ABN , First Publish Date - 2021-06-12T09:40:53+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోనూ సినీనటుడు సోనూసూద్‌ సేవలు ప్రారంభమయ్యాయి. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే కొవిడ్‌ బాధితుల ఇంటికే ఆక్సిజన్‌ సిలిండర్‌ సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు.

అనంతలో సోనూసూద్‌ సేవలు

కొవిడ్‌ బాధితుల ఇంటికే ఆక్సిజన్‌ సిలిండర్‌ సరఫరా

టోల్‌ఫ్రీ నంబర్‌ 70699 99961 ఏర్పాటు చేసిన ట్రస్ట్‌


అనంతపురం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోనూ సినీనటుడు సోనూసూద్‌ సేవలు ప్రారంభమయ్యాయి. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే కొవిడ్‌ బాధితుల ఇంటికే ఆక్సిజన్‌ సిలిండర్‌ సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలకు శ్రీకారం చుట్టినట్లు సోనూసూద్‌ ట్రస్టు ప్రతినిధి అమిత్‌ పురోహిత్‌ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో అనంతపురం కూడా ముందు వరుసలో ఉంటోంది. దీంతో ఈ జిల్లాలో కరోనా బాధితులెవరూ ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సోనూసూద్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సోనూసూద్‌ ట్రస్టు ద్వారా జిల్లాలో 24 గంటలూ సేవలందిస్తామని వెల్లడించారు. కరువు జిల్లా, అందులోనూ పేదలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఒక్కో సిలిండర్‌కు వేల రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని, అందుకే సోనూసూద్‌ అనంతపురం జిల్లాను ఎంచుకున్నారని తెలిపారు. కరోనా బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 70699 99961కు ఫోన్‌ చేసిన వెంటనే ట్రస్టు ప్రతినిధులు కొవిడ్‌ బాధితుడి ఇంటికే వెళ్లి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందజేస్తారన్నారు. బాధితులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు ప్రతినిధి పురోహిత్‌ చేసిన వీడియో కాల్‌లో సోనూసూద్‌ మాట్లాడుతూ.. ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-12T09:40:53+05:30 IST