సోమూ.. నోరు జాగ్రత్త!
ABN , First Publish Date - 2021-12-09T08:42:54+05:30 IST
‘‘నిస్వార్థంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టులపై లేనిపోని

బీజేపీ రాష్ట్ర నేతలు దద్దమ్మలు : రామకృష్ణ
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 8: ‘‘నిస్వార్థంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టులపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. సోము వీర్రాజు... నోరు అదుపులో పెట్టుకో. తస్మాత్ జాగ్రత్త’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో డబుల్ గేమ్ షో ఆడుతూ ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు చేతగాని దద్దమ్మలు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా సాక్షాత్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలేదు. రాష్ట్రంలో మీ డబుల్ గేమ్ డ్రామాలు ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా? ఏదో ఒకరోజు రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమికొడతారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సాధించిన వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా? సోము వీర్రాజూ... డబ్బులిస్తే కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తారని అంటావా! డబ్బులు మీ నాన్న ఇచ్చాడా... మీ తాత ఇచ్చాడా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఉద్యోగుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.