‘ఆల్మట్టి’ ఎత్తును అడ్డుకోండి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-07-12T07:56:08+05:30 IST

తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ఆడ్డుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.

‘ఆల్మట్టి’ ఎత్తును అడ్డుకోండి: సోమిరెడ్డి

మదనపల్లె టౌన్‌, జూలై 11: తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ఆడ్డుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం, మహారాష్ట్రలో బీమా నదిపై నిర్మించే డ్యాంలను అడ్డుకోకపోతే రెండు రాష్ట్రాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంతం ఎడారిగా మారిపోతుందన్నారు. ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు అపెక్స్‌ కౌన్సిల్‌లో వాదించి ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత సీఎంలు జగన్‌, కేసీఆర్‌ అపెక్స్‌ కౌన్సిల్‌లో వారి వాదనలు వినిపించి రెండు రాష్ట్రాలకు అందాల్సిన కృష్ణా జలాల కోసం పోరాడాలని కోరారు.


కృష్ణా, తుంగభద్ర జలాలపై రాయలసీమ రైతులు ఆధారపడుతున్నారని, ఈ జలాలను అడ్డుకుంటున్న తెలంగాణతో చర్చించడానికి సీఎం జగన్‌ మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. కాగా, చిత్తూరు జిల్లా కలికిరి, పుంగనూరుల్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలు, ప్రతిపక్షాలపై కాకుండా, పక్క రాష్ట్రం నుంచి జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్‌ పౌరుషం చూపించాలని సూచించారు. పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్‌ కృష్ణా జలాల హక్కుల గురించి ఏపీని ప్రశ్నిస్తుంటే ఇక్కడి సీఎం నోరెత్తకుండా నిమ్మకు నీరెత్తారని ఎద్దేవా చేశారు. శ్రీశైలం నీటివిషయంలో రాయలసీమ హక్కులపై పులివెందుల బిడ్డ, సీఎం జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోరాడే సత్తాలేక ఢిల్లీకి లేఖలు రాస్తూకాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-07-12T07:56:08+05:30 IST