సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు చట్టవిరుద్ధం

ABN , First Publish Date - 2021-01-12T07:57:22+05:30 IST

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారమే డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు చట్టవిరుద్ధం

  • ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చాక
  • హైకోర్టు జోక్యం చేసుకోజాలదు
  • డివిజన్‌ బెంచ్‌కు ఎస్‌ఈసీ అప్పీల్‌
  • హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు
  • అత్యవసరంగా చేపట్టాలని వినతి
  • నేటి ఉదయం 10.30కి విచారణ


అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారమే డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. మంగళవారం ఉదయం 10.30 కు విచారణ జరుపుతామని పేర్కొంది. ‘సింగిల్‌ జడ్జి ఉత్తర్వు లు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్నికల ప్రక్రి య అమల్లోకి వచ్చాక హైకోర్టు జోక్యం చేసుకోజాలదు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ ప్రశ్నించలేరని.. పూర్తయిన తర్వాత మాత్రమే సవాల్‌ చేయవచ్చని 2000వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో రాజ్యాంగంలోని 226 అధికరణ మేరకు కోర్టుల విచారిణాధికారం పరిమితమైంది.


కరోనాపై ప్రభుత్వ వివరణ పరిగణనలోకి తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందని సింగిల్‌ జడ్జి పొరపాటు పడ్డారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వివరాలు ఏమీ లేకుండా విచారణ దశలో ఆ నిర్ణయానికి రావడం సరికాదు. ఎస్‌ఈసీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఆధారాలు కో ర్టు ముందున్నాయి. రాజస్థాన్‌, కేరళ, కర్ణాటక హైకోర్టులు స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు నిరాకరించాయి. ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సింది. వీటన్నిటి దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేయండి’ అని ఎస్‌ఈసీ పిటిషన్‌లో కోరింది.

Updated Date - 2021-01-12T07:57:22+05:30 IST