బోష్‌డీకే కన్నా ‘కాల్చి చంపండి’ పెద్ద బూతు
ABN , First Publish Date - 2021-10-21T11:01:33+05:30 IST
‘‘విపక్షనేతగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని పట్టుకొని, నడిరోడ్డుపై కాల్చి చంపండి.

- చంద్రబాబును చంపాలని, బంగాళాఖాతంలో
- పడేయాలని నాడు జగన్ అనడం సరైనదేనా?
- ఆ వ్యాఖ్యలు బూతు కన్నా ప్రమాదకరం కాదా?
- ఆఫీసులపై దాడులు చేస్తే అరెస్టు చేయరా?
- అభిమానులని వదిలేస్తారా?: రఘురామ ప్రశ్న
న్యూఢిల్లీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘విపక్షనేతగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని పట్టుకొని, నడిరోడ్డుపై కాల్చి చంపండి.. బంగాళాఖాతంలో కలిపేయండి అని ప్రజలను రెచ్చగొట్టేలా వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం నిజంకాదా? ఆ వ్యాఖ్యలను ఇప్పుడు సీఎంగా ఉన్న ఆయన సమర్థించుకుంటారా? టీడీపీ నేత పట్టాభి వాడిన ‘బోష్‌డీకే’ అనే పదం కంటే ‘కాల్చి చంపండి’ అనేది పెద్ద బూతు. వెయ్యి ఆటంబాంబులంత ప్రమాదకరం అది’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో టీడీపీ కార్యాలయాల విధ్వంసంపై బుధవారమిక్కడ ఆయన స్పందించారు. ‘‘మిమ్మల్ని తిట్టినందుకు తట్టుకోలేక మీ అభిమానులు దాడులకు పాల్పడినట్టు సమర్థించుకోవడం ధర్మమేనా? మీరు చెప్పిన ప్రకారం అభిమానులే దాడులు చేస్తే, వారిని అరెస్ట్ చేయరా? దాడులు చేసినవారు మీ దృష్టిలో రాష్ర్టానికి మంచి చేసినట్టా? చంద్రబాబును మీరు తిట్టినప్పుడు ఆయన అభిమానులు అప్పట్లో మీరు చెప్పినట్టే బీపీలు పెంచుకుని దాడులు చేయకపోవడం టీడీపీ తప్పా?’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబే తన పార్టీ కార్యాలయాలపై వ్యూహాత్మకంగా దాడులు చేయించినట్లు హోంమంత్రి సుచరిత చెబితే, అది తన అభిమానుల పని అని సీఎం చెబుతున్నారని.. వారిద్దరి వ్యాఖ్యలకు ఎక్కడా పొంతనలేదన్నారు.
టీడీపీని రద్దు చేయాలని, నిషేధించాలంటున్న మంత్రి బొత్స... గతంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మను ‘విజయ’ అంటూ ఏకవచనంతో వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. ‘‘నాపై నాడు అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే నానా దుర్భాషలాడితే... తన మనసు గెలుచుకున్నట్లు సీఎం అతనికి కితాబిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాసాను. రాష్ట్రపతి ఆపాయింట్‌మెంట్ కూడా అడిగాను’’ అని రఘురామ తెలిపారు.