వైసీపీలో అవమానం..? సుబ్బారెడ్డి రాజీనామా
ABN , First Publish Date - 2021-12-18T22:04:05+05:30 IST
జడ్పీచైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కథ రాజీనామాతో ముగిసింది. వైసీపీలోని బంధుప్రీతికి ఆయన పదవి చేజారి పోయింది.
కర్నూలు: జడ్పీచైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కథ రాజీనామాతో ముగిసింది. వైసీపీలోని బంధుప్రీతికి ఆయన పదవి చేజారి పోయింది. వెంకటసుబ్బారెడ్డి కలెక్టర్ కోటేశ్వరావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించడం గమనార్హం. చైర్మన్ పదవి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మద్దతున్న కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం వెంకటసుబ్బారెడ్డి పక్షాన లేదని తేలిపోయింది. వైసీపీలో పదవుల పందేరం ముందు అన్నీ దిగదుడుపే అయ్యాయి. జడ్పీ చైర్మన్‌గా మురిపెం తీరకముందే ఆయన పదవికి గండం వచ్చిపడింది. మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డితో తక్షణమే రాజీనామా చేయించాలని జిల్లా నాయకులు పట్టుబట్టారు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. దీంతో సంక్షోభం తలెత్తింది.
రంగంలోకి దిగిన వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే కాటసానికి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అయినా దయ చూపుతారని మల్కిరెడ్డి ఆశించారు. కానీ ఆయనకు అమరావతిలోనూ నిరాశే ఎదురైంది. వేరే ఏదైనా పదవి హామీ ఇస్తారని ఆశించారు. అదీ చుక్కెదురే అయినట్లు తెలుస్తోంది. అవమాన భారంతో ఉన్న మల్కిరెడ్డి కర్నూలుకు తిరిగొచ్చాక తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన తనకు కనీసం ఏడాదైనా చైర్మన్‌గా పార్టీ అవకాశం ఇవ్వలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తోంది.
కనీసం ఏడాదైనా పదవిలో ఉంచకుండా నెలన్నరకే మార్చడం ఏమిటని సుబ్బారెడ్డి వర్గం ప్రశ్నింస్తోంది. ఒక్క సర్వ సభ్య సమావేశం జరగక ముందే దేనికి చైర్మన్‌ను అత్యవసరంగా మారుస్తున్నారని పార్టీని పలువురు నిలదీస్తున్నారు. ఎర్రబోతుల పాపిరెడ్డి ఎన్నిక జరిగాక తక్షణమే రాజీనామా చేయాలన్న నిబంధన పెట్టడంతో జిల్లాలో ఎందరో నాయకులున్నా చైర్మన్‌గా ఉండేందుకు సిద్ధం కాలేదని, ఎమ్మెల్యేను నమ్మిన పాపానికి మల్కిరెడ్డి ఇపుడు అనుభవిస్తున్నారనే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ కొద్ది కాలానికి వేరే వాళ్లను చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి ఉంటే నామినేటెడ్ పోస్టుకైనా మల్కిరెడ్డి ప్రయత్నం చేసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. వేరే పదవికీ హామీ ఇవ్వకుండా ఆయన భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నారని మల్కిరెడ్డి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.