జగన్‌ పత్రికలో అంబేడ్కర్‌కు అవమానం

ABN , First Publish Date - 2021-04-17T09:38:33+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పత్రికలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి రోజునే ఆయన్ను అవమానించారంటూ

జగన్‌ పత్రికలో అంబేడ్కర్‌కు అవమానం

రాజ్యాంగ నిర్మాతను కించపరిచారంటూ పలువురి ఆగ్రహం

యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

సీఎంకు అంబేడ్కర్‌పై సదభిప్రాయం లేదు: హర్షకుమార్‌

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: టీడీపీ 

తక్షణమే క్షమాపణలు చెప్పాలి: శ్రావణ్‌కుమార్‌


రాజమహేంద్రవరం/ముమ్మిడివరం/విజయవాడ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ పత్రికలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి రోజునే ఆయన్ను అవమానించారంటూ పలువురు నిరసన వ్యక్తంచేశారు. పత్రిక యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్మోహన్‌రెడ్డికి అంబేడ్కర్‌పై సదభిప్రాయం లేదని అమలాపురం మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీఎంకు అంబేడ్కర్‌ అంటే వ్యంగ్య భావన అనుకుంటా..


ఆయన జయంతి రోజే జగన్‌ పత్రికలో అంబేడ్కర్‌ చిత్రాన్ని వ్యంగ్యంగావేసి అవమానించారు. దీనికి బాధపడని వ్యక్తిలేడు. ఇటువంటి పత్రికకు వ్యాసాలు రాసేవారు కూడా ఆలోచించాలి. పత్రిక యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీనిని ప్రచురించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలి. పత్రికను బ్యాన్‌ చేయాలి. అంబేద్కర్‌ వాదులంతా జగన్‌ పత్రిక యాజమాన్యంపై కేసులు పెట్టాలి’ అని అన్నారు. ‘దళితుల్లో మార్పు వచ్చింది. అది నేను అంబేడ్కర్‌ జయంతినాడు చూశాను. వైసీపీ వారే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వైసీపీలో నాయకులు తప్ప మిగతా కేడరంతా పక్కకు వెళ్లినట్టు కనిపిస్తోంది. జగన్‌ ప్రభుత్వం దళితుల పథకాలన్నీ ఎత్తివేసింది. రెండేళ్లలో ఏ స్కీమూ లేదు. స్కాలర్‌షి్‌పలు లేవు. మా కాలేజీకే రూ.3 కోట్లు ఇవ్వాలి’ అన్నారు.


పత్రిక ప్రతులు దహనం

అంబేడ్కర్‌ను వ్యంగ్యంగా చిత్రీకరించిన జగన్‌ పత్రిక వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం పార్టీ కార్యాలయం వద్ద 216 జాతీయ రహదారిపై నిరసన వ్యక్తంచేసి పత్రిక ప్రతులను దహనం చేశారు. జగన్‌ పత్రిక యాజమాన్యంపై అట్రాసిటీ కేసులు నమోదుచేయాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో అమలాపురం టీడీపీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ పొద్దోకు నారాయణరావు (బాలు) సీఐ ఎం.జానకిరామ్‌కు ఫిర్యాదు చేశారు. 


బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న పత్రికలో అంబేడ్కర్‌ను అవమానించినందుకు యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అగ్రహం వ్యక్తంచేశారు.

Updated Date - 2021-04-17T09:38:33+05:30 IST