దూసుకొస్తున్న తుఫాన్‌!

ABN , First Publish Date - 2021-05-24T10:16:27+05:30 IST

అతి తీవ్ర తుఫాన్‌ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం తుఫాన్‌ ‘యాస్‌’గా మారే అవకాశం ఉందని భారత

దూసుకొస్తున్న తుఫాన్‌!

ముంచుకొస్తున్న ముప్పు!

బంగాళాఖాతంలో వాయుగుండం

నేడు తుఫాన్‌ ‘యాస్‌’గా మారే అవకాశం

ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష..

ఒడిసా, బెంగాల్‌లో ముందస్తు చర్యలు 

రంగంలోకి నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌..

రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు 

ఓడరేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక..

పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష 


అమరావతి/విశాఖపట్నం/హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): అతి తీవ్ర తుఫాన్‌ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం తుఫాన్‌ ‘యాస్‌’గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందవచ్చని సూచించింది. ఈ నెల 26వ తేదీ ఉదయం ఉత్తర ఒడిసా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం చేరుకుంటుందని, అదే రోజు సాయంత్రం పరదీప్‌, సాగర్‌ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో 155-165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, వీటి వేగం 185 కి.మీ వరకూ పెరిగే అవకాశముందని తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో ఒడిసా, బెంగాల్‌లలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కాగా నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆగ్నేయ, తూర్పు-మఽధ్య బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌- నికోబార్‌ దీవుల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. 


ప్రణాళికతో పనిచేయండి: మోదీ 

తుఫాన్‌ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను, సముద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితులకు, టీకాలు వేయించుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఓ ప్రఽణాళికతో సహాయక, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో హోం శాఖ మంత్రి అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఒడిసా, బెంగాల్‌లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


పలు రైళ్లను రద్దు చేశారు. 46 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించగా, మరో 13 బృందాలను తరలించారు. సహాయక చర్యల్లో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్ట్‌ గార్డు సిబ్బంది పాల్గొంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ మొత్తం 36 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. 57 టన్నుల సామాగ్రిని, 606 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తరలించింది. 


పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను తుఫాన్‌ ప్రభావంతో రద్దు చేస్తున్నట్లు సీపీఆర్‌ఓ రాకేశ్‌ తెలిపారు. ఈనెల 24న హౌరా-యశ్వంత్‌పూర్‌, హౌరా-వాస్కోడిగామా, 27న తిరువనంతపురం-శాలీమార్‌, హౌరా-తిరుచిరాపల్లి, చెన్నై సెంట్రల్‌-సాంత్రగాచి, 28న పురులియా-విల్లుపురం, 29న కన్యాకుమారి-హౌరా, తాంబరం-జసిడి, 30న హౌరా-పాండిచ్చేరి రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. 


కోస్తా తీరంలో గాలుల ఉధృతి

కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సోమవారం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుందని, మత్య్సకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగింది. కలెక్టర్‌ నివాస్‌ అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలను గుర్తించారు. రానున్న 2 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ స్టెల్లా తెలిపారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, విజయనగరం నుంచి గుంటూరు వరకు అనేక మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 37.9 నుంచి 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలో అక్కడక్కడా ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి. 



Updated Date - 2021-05-24T10:16:27+05:30 IST