ఎమ్మెల్యే గొల్లకు నిరసనల సెగ

ABN , First Publish Date - 2021-12-31T08:02:54+05:30 IST

ఎమ్మెల్యే గొల్లకు నిరసనల సెగ

ఎమ్మెల్యే గొల్లకు నిరసనల సెగ

రోడ్డుపై బైఠాయించిన సొంత పార్టీ కార్యకర్తలు

‘ఎమ్మెల్యే గో బ్యాక్‌’ అంటూ నినాదాలు

కారులోనే ఉండిపోయిన ఎమ్మెల్యే బాబూరావు

ఆందోళనకారులను గెంటేసిన పోలీసులు


పాయకరావుపేట రూరల్‌, డిసెంబరు 30: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సొంతపార్టీ వారి నుంచే నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఈనెల 28న ఎస్‌.రాయవరం మండలం బంగారమ్మపాలెంలో వైసీపీ ముఖ్యనేత బొలిశెట్టి గోవిందరావు, ఎంపీపీ శారదాకుమారిసహా 25 పంచాయతీల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సమావేశమై ఎమ్మెల్యే వైఖరిపై బహిరంగంగానే ధ్వజమెత్తారు. తాజాగా పాయకరావుపేట మండలంలో పలువురు నాయకులు ప్రత్యక్ష నిరసనకు దిగారు. గురువారం మధ్యాహ్నం పాయకరావుపేట మండలం రాజవరంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బాబూరావు వెళుతుండగా.. గ్రామ శివారులో వైసీపీ బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి యజ్జల సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే గో బ్యాక్‌, ఎమ్మెల్యే వద్దు...జగన్‌ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ‘మీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కనబెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారికి పనులు చేస్తున్నార’ంటూ మండిపడ్డారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగించేందుకు ప్రయత్నించగా.. వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు  ఆందోళనకారులను పక్కకు నెట్టేసి.. ఎమ్మెల్యే వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా యజ్జల సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గొల్ల బాబూరావు గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. తమ వర్గానికి చెందిన వలంటీర్లను అకారణంగా తొలగిస్తున్నారని అన్నారు.Updated Date - 2021-12-31T08:02:54+05:30 IST