TPT : ఫలించని సహోద్యోగుల యత్నం.. అనారోగ్యంతో పంచాయతీ కార్యదర్శి మృతి..

ABN , First Publish Date - 2021-12-31T12:34:50+05:30 IST

విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ సచివాలయ ఉద్యోగి ప్రాణాలు నిలపడానికి సహచర...

TPT : ఫలించని సహోద్యోగుల యత్నం.. అనారోగ్యంతో పంచాయతీ కార్యదర్శి మృతి..

చిత్తూరు/తంబళ్లపల్లె : విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ సచివాలయ ఉద్యోగి ప్రాణాలు నిలపడానికి సహచర ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం విషాదాన్ని నింపింది. పీటీఎం మండలానికి చెందిన దిలీప్‌కుమార్‌ తంబళ్లపల్లె మండలం బాలిరెడ్డిగారిపల్లె పంచాయతీ కార్య దర్శి(గ్రేడ్‌-5)గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం బాలిరెడ్డిగారి పల్లెలో ఉండగా వాంతులు, విరేచనాలు కావడంతో దిలీప్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచర ఉద్యోగులు మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వైద్యుల సూచన మేరకు వేలూరు సీఎంసీకి తరలించారు.


దిలీప్‌ను పరీ క్షించిన వైద్యులు.. పేగు మడత పడిందని వెంటనే ఆపరేషన్‌ చేయాలని అందుకు సుమారు రూ.4 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలి పారు. రూ.1.5 లక్షలు చెల్లిస్తే అత్యవసర వైద్య చికిత్స మొదలుపెడతామని కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వున్న దిలీప్‌కుమార్‌ కుటుంబసభ్యులు సాయం కోసం పలువురిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న సహచర ఉద్యోగులు సమాచారాన్ని వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేశారు. జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు స్పందించి గురువారం సాయంత్రానికి రూ.3,70,000 దిలీప్‌కుమార్‌ అకౌంట్‌కు జమ చేశారు. దీంతో గురువారం రాత్రి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తరలిస్తుండగా దిలీప్‌ కుమార్‌ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎంపీడీవో దివాకరరెడ్డి, ఈవోపీఆర్డీ రాజశేఖర్‌నాయక్‌ తెలిపారు. సహచరుడి ప్రాణం నిలపాలన్న సహచర ఉద్యోగుల, ప్రజా ప్రతి నిధుల ప్రయత్నం విఫలం కావడంతోవారిలో తీవ్రవిషాదాన్ని నింపింది.

Updated Date - 2021-12-31T12:34:50+05:30 IST