‘సంగం’ స్వాధీనం చెల్లదు

ABN , First Publish Date - 2021-05-08T08:35:56+05:30 IST

సంగం డెయిరీ యాజమాన్యానికి హైకోర్టులో ఊరట లభించింది. డెయిరీ ఆస్తులను, యాజమాన్యాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటూ గత నెల 27న ప్రభు త్వం జారీచేసిన ఉత్తర్వును కోర్టు సస్పెండ్‌ చేసింది

‘సంగం’ స్వాధీనం చెల్లదు

జీవోను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

డెయిరీ యాజమాన్యానికి ఊరట

నిర్వహణ బాధ్యతలు తిరిగి సంగం మిల్క్‌ కంపెనీకే

సబ్‌ కలెక్టర్‌ కలగజేసుకోకూడదు

ప్రాంగణంలోనికే రాకూడదు

కోర్టు అనుమతి లేకుండా హక్కులు, తనఖాలు కుదరవు

న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు


జీవోను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

  • సంగం డెయిరీ ప్రాంగణంలోకి తెనాలి సబ్‌ కలెక్టర్‌ రాకూడదు. పరిపాలన/నిర్వహణ విషయంలో కలుగజేసుకోకూడదు.
  • ప్రభుత్వం తమవిగా చెబుతున్న ఆస్తులు దశాబ్దాలుగా సంగం డెయిరీ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ ఆస్తులు తమవేనని ప్రభుత్వం భావించినా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా వాటిని స్వాధీనపరచుకోజాలదు.
  • దశాబ్దాలుగా డెయిరీ పిటిషనర్‌ కంపెనీ స్వాధీనంలోనే ఉంది. ప్రభుత్వ చర్యలతో కంపెనీకి తీవ్ర నష్టం జరుగుతుంది.        

 - హైకోర్టు


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ యాజమాన్యానికి హైకోర్టులో ఊరట లభించింది. డెయిరీ ఆస్తులను, యాజమాన్యాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటూ గత నెల 27న ప్రభు త్వం జారీచేసిన ఉత్తర్వును కోర్టు సస్పెండ్‌ చేసింది. డెయిరీ యాజమాన్య బాధ్యతలు, యూనియన్‌పై నియంత్రణను తిరిగి సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ(ఎ్‌సఎంపీసీఎల్‌)కు అప్పగించింది. డెయిరీ నిర్వహణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారికి అప్పగించడం పరిపాలనాపరమైన ఇబ్బ ందులకు దారితీస్తుందని పేర్కొంది. డెయిరీ ప్రాంగణంలోకి తెనాలి సబ్‌ కలెక్టర్‌ రాకూడదని.. పరిపాలన/నిర్వహణ విషయంలో కలగజేసుకోకూడదని ఆదేశించింది. రోజువారీ కార్యకలాపాలు, జీతాలు-బకాయిల చెల్లింపు మొదలైనవి ఎస్‌ఎంపీసీఎల్‌ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కంపెనీ బోర్డు ఆస్తులపై హక్కులు కల్పించడం, తనఖా పెట్టడం చేయకూడదని పేర్కొంది. 


డెయిరీకి సంబంధించి స్థిర-చర ఆస్తుల బదిలీ, తనఖా పెట్టే విషయంలో ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. పాలు కొనుగోలు, విక్రయం, పాల ఉత్పత్తుల అమ్మకం వంటి సాధారణ వ్యాపార వ్యవహారాలను ఎస్‌ఎంపీసీఎల్‌ ఎలాంటి అడ్డంకి లేకుండా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. డెయిరీ నిర్వహణ బాధ్యతను గుం టూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 జులై 17న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ.. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీచేసిన జీవో 19ని సవాల్‌ చేస్తూ సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ వి.ఽధర్మారావు వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం ఇటీవల వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు తీర్పును వాయిదా వేశారు. జీవో అమలును నిలుపుదల చేస్తూ శుక్రవారం నిర్ణయాన్ని వెలువరించారు. తుది తీర్పు వెల్లడించాలంటే పలు అంశాల పై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు.


న్యాయమూర్తి ఏమన్నారంటే...

‘ఏపీ సహకార చట్టం మేరకు పాల ఉత్పత్తిదారులు.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల కోఆపరేటివ్‌ యూనియన్‌(జీడీఎంపీసీయూ)గా ఏర్పడ్డారు. డెయిరీ భూములను పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో కొనుగోలు చేసినట్లు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోంది. పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో భూములు కొనుగోలు చేసినట్లు 1964 డెయిరీ వార్షిక ఆడిట్‌లో కూడా ప్రస్తావించారు. 1978లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 515 మేరకు జాగర్లమూడి వద్ద ఉన్న ఫీడర్‌ బ్యాలెన్సింగ్‌ డెయిరీని జీడీఎంపీసీయూకి అప్పగించారు. ప్రభుత్వ నిధులను షేర్‌ కేపిటల్‌గా మార్చారు. సహకార సంఘాన్ని మ్యుచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీగా మార్చే క్రమంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.81లక్షలను 1996లో తిరిగిచ్చారు. ఆ తర్వాత మ్యుచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీగా.. సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీగా అవతరించింది. అందుకు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఇచ్చిన సర్టిఫికెటే సాక్ష్యం. మ్యుచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీగా మార్చడంపై అడ్వకేట్‌ జనరల్‌ లేవనెత్తిన పలు సందేహాలపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో.. ప్రభుత్వ ఆస్తుల కోసమే చర్యలు తీసుకున్నామన్న ప్రభుత్వ వాదనలను కూడా పూర్తిగా విస్మరించలేం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T08:35:56+05:30 IST