సాగుకు సై... శాంపిల్స్ నై!
ABN , First Publish Date - 2021-05-13T09:16:44+05:30 IST
రాష్ట్రంలో ఖరీఫ్ మొదలుకాబోతోంది. ఒకవైపు సమ్మర్‌కాటన్ వేయడానికి రైౖతులు భూములను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు మార్కెట్‌లో ఆకర్షణీయమైన సంచులతో విత్తనాలను అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు

కల్తీ, నకిలీ వ్యాపారులకే వ్యవ‘సాయం’
ఖరీ్‌ఫలో ఖరారుకాని విత్తన శాంపిల్స్ సేకరణ
టార్గెట్ ఇవ్వనిదే ఎలా తీయాలంటున్న అధికారులు
కంపెనీలకు మేలుచేసేలా వ్యవహరిస్తున్న అధికారులు
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఖరీఫ్ మొదలుకాబోతోంది. ఒకవైపు సమ్మర్‌కాటన్ వేయడానికి రైౖతులు భూములను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు మార్కెట్‌లో ఆకర్షణీయమైన సంచులతో విత్తనాలను అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. అయితే, అధికారులు 2021 ఖరీ్‌ఫలో విత్తనాల శాంపిల్స్ సేకరణ లక్ష్యాలను ఇంతవరకూ ఖరారు చేయలేదు. ప్రతిఏటా మొదటి దశ మార్చి - ఏప్రిల్లో ఖరీఫ్ విత్తన శాంపిల్స్ సేకరణ లక్ష్యాలను వ్యవసాయశాఖ జిల్లాల వారీగా ఖరారు చేస్తోంది. రెండో దశలో జిల్లాల జేడీలు మండలాల వారీగా శాంపిల్స్ లక్ష్యాలను ఖరారు చేస్తారు. ప్రధానంగా పరిశోధనా కేంద్రాలు నిర్వహించే ఖరీఫ్, రబీ సలహా మండలి సమావేశాల్లో జిల్లాల వారీగా విస్తరణ విభాగం ఇచ్చే అంచనాలకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యానశాఖలు జిల్లాల వారీగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగుచేస్తారో అంచనా వేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగానే ఆహార ఉత్పత్తుల అంచనాలను రూపొందిస్తారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మార్కెట్‌లో రైతులకు విత్తనాలను అందుబాటులో వుంచుతుంది. దానికి తగిన విధంగా సీడ్ సర్టిఫికేషన్ సంస్థలతో చర్చిస్తారు. ఏ పంట ఎన్ని హెక్టార్లలో పండించాలి.. దానిలో వచ్చే విత్తనం ఎంత.. మన అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తారు.
మార్చి నుంచే మార్కెట్‌లోకి విత్తనాలు
ఖరీ్‌ఫలో అవసరమైన వివిధ రకాల విత్తనాలను వ్యాపారులు మార్చి నుంచే మార్కెట్‌లో అందుబాటులో వుంచుతారు. గత ఏడాది పత్తి, మిరప పంట తగ్గినా మంచి ధర వచ్చింది. దీంతో ఖరీ్‌ఫలో వీటిసాగు పెరుగుతుందని వ్యవసాయ, ఉద్యాన శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పెరిగే విస్తీర్ణానికి అనుగుణంగా వ్యాపారులు విత్తన నిల్వలను పెంచారు. కానీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2021 ఖరీఫ్ విత్తన సేకరణ లక్ష్యాలను వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ఖరారు చేయలేదు. రాష్ట్ర కార్యాలయం జిల్లాలకు లక్ష్యాలను ఇవ్వకపోవడంతో జేడీలు, ఏడీలు, మండల వ్యవసాయశాఖ అధికారులు టార్గెట్‌లను నిర్ణయించలేదు. రెండు వారాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణం ఇదేవిధంగా కొనసాగితే 2-3 వారాలలో పత్తి సాగుచేసే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వివిధ నర్సరీల యజమానులు ఇప్పటికే నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో నారుపోయటానికి భూమిని సిద్ధం చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్ వున్న హైబ్రిడ్ మిర్చినారు పోయటానికి విత్తనాలను కొనుగోలు చేశారు. అధికారులు మార్కెట్‌లో వున్న విత్తనాలలో శాంపిల్స్ సేకరించి నాణ్యత, మొక్కశాతాన్ని నిర్ధారించాలి. అయితే అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై ప్రతిఏటా శాంపిల్స్ సేకరణ రికార్డులకే పరిమితం చేస్తున్నారు.
కొంతమంది అధికారులు శాంపిల్స్ తీయకుండా వుంటే ఒకరేటు, తాము చెప్పిన రకాలలో తీస్తే ఒక రేటు అనేవిధంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ఏడాది విత్తన సేకరణకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం రూపొందిస్తున్నట్లు కమిషనర్ కార్యాలయం అధికారులు తెలిపారు. అందువలన విత్తన శాంపిల్స్ సేకరణ లక్ష్యాలను ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. మామూలుగా శాంపిల్స్ సేకరణ సమయంలో బార్‌కోడ్ నెంబరు ఇవ్వాలి. కమిషనర్ కార్యాలయం జిల్లాల వారీగా ఈ నెంబర్లు ఇస్తే... మండలాల వారీగా యంఏవో, ఏడీలకు జిల్లా జేడీ బార్‌కోడ్ నెంబరు ఇస్తారు. శాంపిల్స్ సేకరిస్తే ఏ బార్‌కోడ్ నెంబరు ఇవ్వాలని యంఏవోలు ప్రశ్నిస్తున్నారు.
పత్తాలేని ప్రీ రిలీజ్ శాంపిల్స్ సేకరణ
విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను రెండు నెలలకొకసారి అధికారులు తనిఖీలు చేయాలి. తనిఖీల సమయంలో ఆయా యూనిట్లలో ఏ విత్తనం తయారవుతుందో పరిశీలించాలి. ఆ విత్తనం మోడల్ ప్లాంట్లు ఎక్కడ సాగుచేశారు... దిగుబడి... మొక్కశాతం, నాణ్యత తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రాసెసింగ్ యూనిట్‌లో ఈ వివరాలు లేకపోతే అక్కడ కల్తీ, నకిలీ విత్తనాలు తయారవుతున్నట్లు భావించాలి. ఖరీఫ్, రబీలో మార్కెట్‌లో అమ్మబోయే విత్తనాలను 6-7 నెలల ముందే వ్యాపారులు సిద్ధం చేస్తుంటారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో తయారవుతున్న విత్తనంలో ప్రీ రిలీజ్ శాంపిల్స్‌ను సేకరించాలి. ఆ శాంపిల్స్‌లో మొక్కశాతం, పంట, నాణ్యత సక్రమంగా వుంటేనే మార్కెట్‌లో ఆ రకం విత్తనాలకు వ్యవసాయశాఖ అధికారులు అనుమతి ఇవ్వాలి. ప్రస్తుతం ప్రీ రిలీజ్ శాంపిల్స్‌ను వ్యాపారులు, అధికారులు పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రీ రిలీజ్ శాంపిల్స్ సేకరించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అది కూడా వ్యాపారులు తయారు చేసిన నివేదికలపై అధికారలు గుడ్డిగా సంతకాలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో తయారయ్యే విత్తనాలు ఎక్కడ పండించారు. ఆ భూమి సర్వేనెంబరు వివరాలుండాలి. అధికారులు వీటిని పట్టించుకోకుండా యజమానుల సూచనలకు అనుగుణంగా శాంపిల్స్ సేకరించి ఆ విత్తనాలు సక్రమంగా వున్నట్లు నివేదికలిస్తున్నారు. ఈ వ్యవహారాలలో పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా కంపెనీ యజమానులు రూపొందించిన నివేదికలపై సంతకాలు చేస్తున్నారు.
శాంపిల్స్ సేకరణ కాగితాలకే పరిమితం
ఖరీఫ్, రబీ పంటల సాగుకు రెండు నెలల ముందే అధికారులు శాంపిల్స్ సేకరించాలి. అనేక ప్రాంతాలలో శాంపిల్స్ సేకరణ కాగితాలకే పరిమితమవుతోంది. టార్గెట్‌ల విధానం సరికాదు. గిడ్డంగి, షాపులలో వున్న అన్నిరకాల విత్తనాలలో శాంపిల్స్ తీయాలి. అప్పుడే రైతులకు కల్తీ, నకిలీల బెడద వుండదు. అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి. కానీ వారు వ్యాపారుల కోసం పనిచేయటం వలనే కల్తీలు, నకిలీలు మార్కెట్‌లోకి వస్తున్నాయి.
- డాక్టర్ ఆలపాటి సత్యన్నారాయణ, సీనియర్ వ్యవసాయశాస్త్రవేత్త
కల్తీపై కఠినమైన కేసులు పెట్టాలి
కల్తీ ఎరువులు, పురుగు మందులు, నకిలీ విత్తనాల వలన వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతున్నాయి. అధికారులు, శాస్త్రవేత్తలకు ఇచ్చే మామూళ్ల వల్ల వచ్చే ఆదాయం కంటే నాణ్యమైన సరుకు రైతులకు ఇస్తే ఎన్నోరెట్లు ఆదాయం వస్తుందన్న విషయం వ్యాపారులు గుర్తించాలి. పైగా దీనివలన జాతీయ ఆదాయం పెరుగుతోంది. కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులు జాతీయ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నట్లు ప్రభుత్వాలు పరిగణించి కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలి.
- అత్తోట సుబ్బారావు, సీసీఐ సలహామండలి మాజీ సభ్యుడు